
వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్‌మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది!
తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది.
మ్యాట్రిక్స్‌లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది.