ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష లోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదు. అయినా ఈ లాభాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలా? – వివేక్
మీరు పన్ను రిటర్నులను నిబంధనల ప్రకారం దాఖలు చేయాల్సి ఉంటే, అందులో లాభ, నష్టాలను వెల్లడించాలి. స్టాక్స్, లేదా ఈక్విటీ మ్యూచుల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చేవి దీర్ఘకాల లాభాలు. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో మూలధన లాభాల పన్ను వివరాలు ఉంటే, అవి పన్ను రిటర్నుల్లో ముందుగానే నింపి ఉంటాయి.
ఒకవేళ మీ ఆదాయం బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటే, అప్పుడు మీరు రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. 60 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.3 లక్షలు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. మరింత వివరంగా అర్థం చేసుకునేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ పొందొచ్చు. అప్పుడు పన్ను చెల్లించక్కర్లేదు.
ఒకవేళ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిందని అనుకుంటే, అప్పుడు రిబేట్ వర్తించదు. అప్పుడు సాధారణ శ్లాబు రేటు ప్రకారం పన్ను వర్తిస్తుంది. అలాగే, పన్ను వర్తించే ఆదాయం ఉంది కనుక రూ.లక్షకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. ఒకవేళ మీ వార్షిక ఆదాయం బేసిక్ పరిమితి లోపే, రూ.2 లక్షలుగానే ఉందని అనుకుందాం. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష మించినప్పుడు.. రూ.50వేల మొత్తాన్ని బేసిక్ పరిమితి కింద మిగిలి ఉంది కనుక చూపించుకోవచ్చు. అన్ని కేసుల్లోనూ దీర్ఘకాల మూలధన లాభాల వివరాలను రిటర్నుల్లో చూపించాల్సిందే.
ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌కు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం) ప్రయోజనాన్ని తొలగించారని తెలిసింది. నూతన చట్టం అమలుపై స్పష్టత ఇవ్వగలరా?
– గణేశన్
ఈ ఏడాది మార్చి 31 వరకు చేసే పెట్టుబడులకు లాభాల్లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నాన్ ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించింది. దీంతో ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారనే దానితో సంబంధం లేకుండా.. డెట్ ఫండ్స్‌లో వచ్చే లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నూతన నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే పెట్టుబడులకే అమలవుతుంది. దీనికంటే ముందు చేసే పెట్టుబడులకు ఇండెక్సేషన్ ప్రయోజనం వర్తిస్తుంది.
ఇదీ చదవండి: ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..
Comments
Please login to add a commentAdd a comment