సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్‌బాబు చేసే యాక్టింగ్‌కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్‌లోని క్రేజ్‌తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు మన మహేశ్.
సాక్షి, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్‌కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్‌కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్‌కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్‌గా మహేశ్‌బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్‌కి సలాం కొడుతున్నాయి.
వాట్‌నాట్
కూల్‌డ్రింక్ యాడ్‌తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్‌ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి.
మహేశే ఎందుకు
మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఒక్కడుతో మాస్‌ని, పోకిరితో యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్‌లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్‌నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్‌ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్‌కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్‌డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కనిపిస్తున్నారు.
వేరియేషన్స్
వెండితెరపై కూల్ లుక్‌తో కనిపించే మహేశ్‌కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్‌లో జేమ్స్‌బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్‌యాడ్స్ అన్నీ సూపర్ యాక‌్షన్ సీక్వెన్స్‌లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్‌లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్‌లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది.
రన్నింగ్ సిగ్నేచర్
సిల్వర్ స్త్రీన్‌పై మహేశ్‌బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు.
లిస్టు పెద్దదే
సోషల్ మీడియాలో టాలీవుడ్‌కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్‌లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్‌కార్ట్, క్లోజ్‌అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక‌్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్‌స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్‌దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు.
దీపం ఉండగానే
దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో జిగేల్‌మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment