మార్కెట్ ఓవర్‌బాట్ కండీషన్‌లో ఉందని ఈ తరుణంలో తాజా కొనుగోళ్లు చేయవద్దని, లాభాల స్వీకరణే శ్రేయస్కరమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేవారం స్టాక్ మార్కెట్ కదలికలపై సామ్‌కో సెక్యూరిటీస్ సీఈవో జిమోదీ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు.
సూచీలు ఈ వారంలో భారీగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ ర్యాలీ కాంట్రిబ్యూషన్‌లో షేర్ల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. అయితే ప్రముఖ కంపెనీల నుంచి ఫలితాలు ఇంకా రాలేదు. బహుశా వాటి ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరచవచ్చు.
ఇప్పటి వరకు ఫలితాను ప్రకటించిన బ్యాంకులు, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ ప్రదర్శన బాగుంది. ఐటీ కంపెనీలు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోగలిగాయి. ఎన్‌పీఏ వర్గీకరణ ఆలస్యం కావడంతో ఆర్‌బీఐ బ్యాంకింగ్ వ్యాపారాలకు వెసులుబాటును కల్పించింది. లాక్‌డౌన్ కొనసాగింపుతో ప్రజలు ఇంటిలోపల ఉండిపోవడంతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కోవిడ్-19 ఎఫెక్ట్‌తో ఇన్సూరెన్స్ పాలసీలు పెరగాయి అలాగే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ పట్ల ఆసక్తి చూపడం ఫైనాన్స్ సర్వీస్‌లు కంపెనీలకు కలిసొచ్చింది. అయితే ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదు.
కోవిడ్-19 తర్వాత సాధారణ జీవితం ప్రారంభమై వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మార్కెట్ ప్రస్తుత లాభాల్ని కోల్పోయే అవకాశం ఉంది. మార్కెట్ స్వల్పకాలిక సంఘటనలపై అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక, మిడ్‌టర్మ్‌కు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్‌లు షేర్లు రాణిస్తాయని భావించడం అవివేకం అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ లేదా తాజా కొనుగోళ్లకు దూరంగా ఉండటం విశేషం.
ఎఫ్‌పీఐలు మార్కెట్ పతనం నుంచి ఏప్రిల్, మే, జూన్‌లో విపరీతమైన అమ్మకాలు జరిపారు. కోటక్ బ్యాంక్ క్యూఐపీ, ఆర్‌ఐఎల్ రైట్స్ ఇష్యూ, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్ ఇష్యూల్లో వాటా కొనుగోళ్ల తప్ప మిగిలిన సెకండరీ మార్కెట్లో ఎలాంటి కొనుగోళ్లు జరపలేదు. గడచిన 9ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ.5413 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే మార్కెట్ టాప్‌లో ఉన్నప్పుడు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు జరుపుతారు. బాటమ్‌లో ఉన్నప్పుడు అమ్మకాలు జరుపుతారని తెలుస్తోంది.
టెక్నికల్ అవుట్‌లుక్:
ఈ వారం నిఫ్టీ గ్యాప్‌తో ప్రారంభమై, అధిక స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీకి ఇది వరుసగా 6వ వారం లాభాల ముగింపు కావడం విశేషం. కోవిడ్-19 వాక్సిన్స్ ట్రయల్ విజయవంతమయ్యానే వార్తలు వెలుగులోకి రావడంతో పాటు ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ సెక్టార్లకు చెందిన హెవీ వెయిటేజీ షేర్లు మార్కెట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి.
అయితే బ్యాంక్‌నిఫ్టీ అప్‌ట్రెండ్ మూమెంటంను కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లో బేరీష్ ప్యాట్రన్ ఏర్పడింది. అయితే వారాంతాని కల్లా ఇండెక్స్ పాజిటివ్‌గా ముగిసింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల మధ్య వ్యత్యాసం గత మూడు వారాలుగా కొనసాగుతోంది. నిఫ్టీపై జాగురతతో కూడిన బుల్లిష్ అవుట్‌లుక్‌ను కలిగి ఉన్నాము. నిఫ్టీకి తక్షణ మద్దతు 11000గానూ, కీలక నిరోధస్థాయి 11,240గానూ కేటాయిస్తున్నాము. 10,900 స్థాయిని కోల్పోతే నిఫ్టీ స్వల్పకాలిక బలహీనతకు దారితీయవచ్చు
వచ్చేవారం మార్కెట్ అవుట్‌లుక్:
వచ్చేవారంలో మార్కెట్‌కు కార్పోరేట్ ఫలితాలు, జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(30న) ముగింపు కీలకం కానున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే... అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయి. వీటితో పాటు కోవిడ్ వ్యాక్సిన్ వార్తలు, కరోనా కేసుల పెరుగుదల, రూపాయి, ముడిచమురు ధరల ప్రభావంతో పాటు స్టాక్-ఆధారిత ట్రేడింగ్ మార్కెట్‌కు దిశానిర్దేశాన్ని చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment