సెన్సెక్స్ అరశాతానికి పైగా లాభపడటంతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.09 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 290 లక్షల కోట్లకు చేరింది.
ముంబై: మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు పెరిగి 62,779 వద్ద, నిఫ్టీ 30 లాభంతో 18,632 వద్ద మొదలయ్యాయి.
సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. మిడ్ సెషన్ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 425 పాయింట్లు పెరిగి 63,177 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 18,729 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆఖరికి సెన్సెక్స్ 418 పాయింట్ల లాభంతో 63,177 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 18,716 వద్ద నిలిచింది. ఇరు సూచీలకు ఈ ముగింపు ఆరునెలల కనిష్ట స్థాయి కావడం విశేషం.
రియల్టి , కన్య్సూమర్ డ్యూరబుల్స్, టెలీ కమ్యూనికేషన్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మెటల్, షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.17%, 0.82 శాతం చొప్పున పెరిగాయి. ఆటో షేర్లు మాత్రమే నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 3 డాలర్లు దిగిరావడంతో బర్గర్ పెయింట్స్, కన్షాయ్ నెరోలాక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 4–2% శాతం బలపడ్డాయి.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,678 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 203 కోట్ల షేర్లను విక్రయించారు. డాలర్ మారకంలో రూపాయి ఐదు పైసలు బలపడి 82.38 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే ఆశలతో ప్రపంచ ఈక్విటీ మా ర్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎంఆర్‌ఎఫ్ ః రూ. 1 లక్ష
ఆరు అంకెల ధర తాకిన తొలి దేశీ షేరు
ఇంట్రాడేలో రూ. 1,00,300; రూ. 99,950 వద్ద క్లోజింగ్
దేశీ టైర్ల దిగ్గజం ఎంఆర్‌ఎఫ్ షేరు కొత్త రికార్డు సృష్టించింది. రూ. 1 లక్ష మార్కును అధిగమించిన తొలి షేరుగా ఘనత దక్కించుకుంది. మంగళవారం బీఎస్‌ఈలో 52 వారాల గరిష్టం రూ. 1,00,300 స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 1.02% లాభంతో రూ. 99,950.65 వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ. 1,00,439.95ని తాకి చివరికి 0.94% లాభంతో రూ. 99,900 వద్ద ముగిసింది. స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 12.89% పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment