
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు తాజాగా బ్రేక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు క్షీణించి 45,960 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు కోల్పోయి 13,478 వద్ద స్థిరపడింది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,686 దిగువన, నిఫ్టీ 13,399 వద్ద కనిష్టాలకు చేరాయి.
రియల్టీ అప్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1.6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ 3 శాతం ఎగసింది. రియల్టీ 0.4 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 11.5 శాతం కుప్పకూలగా.. అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, గెయిల్, ఐషర్, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ 3.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, హెచ్‌యూఎల్ 4.2-2.4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ 1.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి.
పీఎస్‌యూ షేర్లు వీక్
డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, రామ్‌కో సిమెంట్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ 4.4-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ సీపీ, టాటా కన్జూమర్, డీఎల్‌ఎఫ్, డాబర్ 5-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,665 క్షీణించగా..1241 లాభాలతో ముగిశాయి.
ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.