న్యూయార్క్: వివాదాస్పద వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగం కొనుగోలు వార్తలను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 15 నాటికి ఈ చర్చలు ముగిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు టిక్‌టాక్ యాప్‌నకు సంబంధించిన భద్రత, సెన్సార్‌షిప్ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా చర్చించినట్లు కంపెనీ పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో టిక్‌టాక్ సర్వీసుల యాజమాన్యం, నిర్వహణ డీల్‌కు సంబంధించి మైక్రోసాఫ్ట్, బైట్‌డ్యాన్స్ ఆసక్తిగా ఉన్నాయంటూ వివరించింది. టిక్‌టాక్‌ను అమెరికాలో త్వరలోనే నిషేధిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన అనంతరం ఆయన, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఆ తర్వాత టిక్‌టాక్ కొనుగోలు అవకాశాలు పరిశీలిస్తున్నామంటూ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
మైనారిటీ వాటాదారులకు అవకాశం..
టిక్‌టాక్‌లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేసేలా ఇతరత్రా అమెరికన్ ఇన్వెస్టర్లను కూడా స్వాగతించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా తెలిపింది. అయితే, ఇతర ఆర్థికాంశాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, యూజర్ల వివరాల గోప్యత, భద్రత విషయంలో నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని టిక్‌టాక్ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికన్ యూజర్ల డేటా అమెరికాలోనే ఉంటుందని, తమ సంస్థలో అత్యధిక పెట్టుబడులు అమెరికా నుంచే ఉన్నాయని వివరించారు.
మూడేళ్లలోనే విశేష ఆదరణ...
2017లో బైట్‌డ్యాన్స్ సంస్థ ప్రారంభించిన టిక్‌టాక్ వీడియో సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బైట్‌డ్యాన్స్ ఆ తర్వాత మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అనే వీడియో సర్వీస్‌ను కూడా కొనుగోలు చేసి టిక్‌టాక్‌తో కలిపింది. మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అమెరికా, యూరప్‌లో బాగా పేరొందింది. బైట్‌డ్యాన్స్‌కు చైనా యూజర్ల కోసం డూయిన్ పేరుతో ఇలాంటిదే మరో సర్వీసు ఉంది. చైనాకు చెందిన యాప్ కావడంతో యూజర్ల డేటాను ఆ దేశానికి చేరవేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో ఇప్పటికే దీన్ని నిషేధించారు. తాజాగా అమెరికా కూడా అదే బాటలో ఉండటంతో బైట్‌డ్యాన్స్ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment