
ముంబై: టోక్యో ఒలింపిక్ గేమ్స్ విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ తెలిపారు. టీవీ, డిజిటల్ ప్రకటనలతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులుగా తమకు ఎదురయ్యే కండరాలు నొప్పులు మొదలైన సమస్యల నుంచి ఉపశమనానికి అమృతాంజన్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడ్డాయని మీరా బాయ్ చాను, బజరంగ్ పునియా తెలిపారు.