ఈ కోర్సులు చదివితే జాబ్‌ గ్యారెంటీ..! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? | Most Demanded Jobs In India In 2025 | Sakshi
Sakshi News home page

ఈ కోర్సులు చదివితే జాబ్‌ గ్యారెంటీ..! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

Published Thu, Mar 24 2022 10:57 AM | Last Updated on Thu, Mar 24 2022 11:42 AM

Most Demanded Jobs In India In 2025 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ఉద్యోగాల్లో డిజిటల్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. దీంతో వచ్చే ఏడాది కాలంలో దాదాపు 2.73 కోట్ల మంది (మొత్తం ఉద్యోగుల్లో సుమారు ఏడు శాతం) ఈ నైపుణ్యాలను సంతరించుకోవాల్సిన అవసరం నెలకొంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) కోసం కన్సల్టింగ్‌ సంస్థ అల్ఫాబీటా నిర్వహించిన ఒక అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

టెక్నాలజీ, టెక్నాలజీయేతర హోదాల్లో పని చేస్తున్న 1,012 మంది డిజిటల్‌ నైపుణ్యాలు గల ఉద్యోగులు .. వివిధ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల 303 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మంది వర్కర్లు .. కోవిడ్‌–19పరంగా ఉద్యోగ విధుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి .. తాము మరిన్ని డిజిటల్‌ నైపుణ్యాలు పెంచుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీలను విధుల నిర్వహణలో  ఉపయోగించగలిగే సామర్థ్యాలు, అవగాహన మెరుగుపర్చుకోవాల్సిన అవసరం నెలకొందని వారు వివరించారు.  

కొన్ని కంపెనీల్లోనే కార్యాచరణ ప్రణాళిక .. 
భారీ స్థాయిలో ఉద్యోగులు డిజిటల్‌ నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇందుకోసం వారికి శిక్షణ కల్పించడానికి సంబంధించి కేవలం 45 శాతం సంస్థల దగ్గరే తగిన కార్యాచరణ ప్రణాళిక ఉంది. దీంతో మిగతావి ఉత్పాదకత, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం వంటి అంశాల్లో వెనకబడే ముప్పు ఉందని నివేదిక తెలిపింది.  

ఈ కోర్సులకు డిమాండ్‌
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి కెరియర్‌ మీద ఫోకస్‌ చేసేవారికి మార్కెట్‌లో అనేక రకాలైన టెక్నాలజీ కోర్సులతో పాటు ఇతర రంగాలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని నేర్చుకోవడం వల్ల త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్స్‌ ఎంపిక విషయంలో అభ్యర్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.  

ఇక రాబోయే మరో రెండు లేదా మూడేళ్లలో అంటే 2025 నాటికి క్లౌడ్‌ డెవలపర్‌ టూల్స్, అకౌంటింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) సాఫ్ట్‌వేర్‌ మొదలైన నైపుణ్యాలకు కంపెనీల్లో ఎక్కువగా డిమాండ్‌ నెలకొంటుందని  కన్సల్టింగ్‌ సంస్థ అల్ఫాబీటా నివేదిక పేర్కొంది.  టెక్నికల్‌ సపోర్ట్, సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలు తర్వాత స్థానాల్లో ఉంటాయి. మెషిన్‌ లెర్నింగ్, క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌ డిజైన్‌ సహా మరింత అధునాతన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నివేదిక వివరించింది. హెల్త్‌కేర్, వ్యవసాయం, ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదలైన రంగాల్లో వీటికి అత్యధికంగా డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది. ఇక నిపుణులు సైతం 

‘మహమ్మారి కాలంలో అన్ని స్థాయుల్లోని కంపెనీలు తమ డిజిటల్‌ ప్రణాళికలను వేగవంతం చేశాయి. దీంతో ఇటు కంపెనీలు అటు ఉద్యోగులు..క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అధునాతన నైపుణ్యాల్లో శిక్షణ పొందాల్సిన అవసరం పెరిగింది‘ అని అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ (ఏఐఎస్‌పీఎల్‌) ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ సెక్టర్‌ విభాగం) రాహుల్‌ శర్మ తెలిపారు.

చదవండి: డిమాండ్‌లో ఉన్న టెక్ స్కిల్స్!! అత్యధిక జీతం అందించే 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు' ఇవే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement