చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు.. | Most Indians Dont Know Much About Country History | Sakshi
Sakshi News home page

చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..

Published Tue, Apr 19 2022 6:37 AM | Last Updated on Tue, Apr 19 2022 6:37 AM

Most Indians Dont Know Much About Country History - Sakshi

న్యూఢిల్లీ: ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతాయని మీకు తెలుసా? పోనీ .. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యమనే సంగతి తెలుసా? కొంత మందికి తెలిసి ఉండొచ్చేమో గానీ.. చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే ఉండటం లేదు. మహీంద్రా హాలిడేస్‌ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

‘‘తమ దేశం గురించి, దేశ భిన్నత్వం, విస్తృతి, సంస్కృతి, వారసత్వం, వంటకాలు మొదలైన వాటి గురించి మన వారిలో అవగాహన లేమి .. ఆశ్చర్యపర్చేలా ఉంది’’ అని సర్వే పేర్కొంది. ఇందులో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. ‘‘భారతదేశ వైవిధ్యంపై అవగాహన, పరిజ్ఞానం గురించి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం చాలా మందికి మన వంటకాల గురించి అతి తక్కువగా తెలుసు.

నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది. దేశీయంగా వివిధ ప్రాంతాలను సందర్శించే కొద్దీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి తమకు తెలియని సంస్కృతులు, వంటకాలు మొదలైన వాటి గురించి ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భారతదేశ వైవిధ్యం గురించి అవగాహన పెంచుకోవచ్చని మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా ఎండీ కవీందర్‌ సింగ్‌ తెలిపారు. సర్వేలో మరిన్ని వివరాలు..

► భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు. ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు.  

► భారతదేశ భౌగోళికాంశాలపై కూడా ప్రజల్లో పరిజ్ఞానం ఒక మోస్తరుగానే ఉంది.  భారతదేశంలోని గిర్‌ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు. అలాగే, ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్‌ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్‌గఢ్‌ కోట .. రాజస్థాన్‌లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు.

► టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్‌ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్‌ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement