మొక్కలకు, చెట్లకు కూడా రకరకాల జబ్బులు వస్తుంటాయి. తెగుళ్లు సోకుతుంటాయి. వాటిని నయం చేయడానికి మందులు మాకులు వాడుతుంటాం. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే! మొక్కలకు వ్యాధులు సోకిన వెనువెంటనే కనిపెట్టడం చాలా కష్టం. కొంత నష్టం జరిగాక గాని, మొక్కల ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకోలేం. అయితే, వాటికి తెగుళ్లు లేదా ఏదైనా జబ్బులు సోకిన వెనువెంటనే ఆ సంగతిని గుర్తించే సాధనాన్ని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇదొక పలుచని గాజు పలకలాంటి చిన్న ఎలక్ట్రానిక్ ప్యాచ్. దీని పొడవు, వెడల్పులు సమానంగా ముప్పయి మిల్లీ మీటర్లు మాత్రమే! దీనిని ఆకులకు తగిలించి ఉంచితే, ఇందులోని సెన్సర్లు మొక్కలకు సోకిన వ్యాధికారక సూక్ష్మజీవులను, పరాన్నజీవులను, పరిసరాల్లోని కాలుష్యం వల్ల మొక్కలకు ఎదురవుతున్న ఒత్తిడిని, మొక్కల్లోని తేమను, ఉష్ణోగ్రతను కూడా నిర్దిష్టంగా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని దీనికి అనుసంధానమై ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది.
దీనివల్ల మొక్కలకు సోకే వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, ఎలాంటి నష్టం జరగకముందే వాటిని కాపాడుకోవచ్చని దీని రూపకల్పనలో కీలకపాత్ర వహించిన ప్రొఫెసర్ యోంగ్ ఝు చెబుతున్నారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీని పనితీరుపై ఇంకా పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలు పూర్తిగా విజయవంతమైతే, ఇది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment