న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర ద్రవ్య, పరపతి విధానం కొనసాగింపునకు తగిన ఆర్థిక గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. 2020 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ‘పాజిటివ్’లోకి మారింది. ఒక శాతం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగం కొంత మెరుగవడం దీనికి ప్రధాన కారణమని తాజా గణాంకాలు తెలిపాయి. ఇక ఆర్‌బీఐ తన పాలసీ విధానానికి ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతంగా నమోదయ్యింది. ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6% –2% శ్రేణిలో (ప్లస్ లేదా మైనస్ 2తో 4 శాతంగా) ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు ఇలా...
మైనింగ్ మినహా అన్నీ మెరుగే...
► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ రంగం 2020 డిసెంబర్‌లో 1.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది.
► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2019 డిసెంబర్‌లో ఈ రంగం 0.1 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం.
► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యం త్రాల ఉత్పత్తికి సూచికగా ఉండే ఈ విభాగంలో వృద్ధి 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020 డిసెంబర్‌లో 18.3 శాతం క్షీణత నెలకొంది.
► కన్జూమర్ డ్యూరబుల్స్: దీర్ఘకాలం మన్నే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 4.9 శాతంగా నమోదయ్యింది. 2019 డిసెంబర్‌లో 5.6 శాతం క్షీణత ఈ విభాగంలో ఉంది.
► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)కు చెందిన ఈ విభాగంలో సైతం రెండు శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 డిసెంబర్లో ఈ విభాగంలో క్షీణ రేటు 3.2 శాతం.
► మైనింగ్: మైనింగ్ రంగం 4.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2019లో ఈ రంగం 5.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణత
కాగా పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణించింది. 2019 ఇదే కాలంలో ఇది స్వల్పంగా 0.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.
ఐఐపీ నడత ఇలా...
2019 డిసెంబర్‌లో ఐఐపీ స్వల్పంగా 0.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2019 డిసెంబర్‌లో తయారీ రంగం 0.3 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ఇక్కడ ప్రస్తావనాంశం. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, దేశాల రక్షణాత్మక విధానాల వంటి అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితి దీనికి నేపథ్యం. కాగా కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా, తాజా గణాంకాలను కోవిడ్–19 ముందు నెలలతో పోల్చుకోవడం సరికాదని కూడా గణాంకాల శాఖ పేర్కొనడం గమనార్హం.
16 నెలల కనిష్టానికి ‘రిటైల్’ ధరలు
జనవరిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం 4.06 శాతంగా నమోదయ్యింది. గడచిన 16 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2019 సెప్టెంబర్‌లో 4 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిత స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడమూ వరుసగా ఇది రెండవనెల కావడం గమనార్హం. డిసెంబర్ 2020లో 4.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఓ తాజా గణాంకాల ప్రకారం, జనవరిలో ఫుడ్ బాస్కెట్ ధర (2019 ఇదే నెల ధరతో పోల్చి) కేవలం 1.89 శాతం పెరిగింది. 2020 డిసెంబర్‌లో ఈ రేటు 3.41 శాతం. కూరగాయల ధరలు 15.84 శాతం తగ్గాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 13.39 శాతం దిగివచ్చాయి. ప్రొటీన్ రిచ్ మాంసం, చేపలు ధరలు 12.54 శాతం తగ్గితే, గుడ్ల ధరలు 12.85 శాతం తగ్గాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.73 శాతం తగ్గాయి. కాగా సీపీఐలో ఒక భాగంగా ఉన్న ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల 3.87 శాతంగా ఉంది. కొన్ని నిర్దిష్ట గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ఎన్‌ఎస్‌ఓ గణాంకాలను సేకరిస్తుంది.
ఆర్‌బీఐ సరళతర పాలసీ కొనసాగింపునకు దోహదం
ఆర్థికాభివృద్ధికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినబడుతోంది. వడ్డీరేటు తగ్గింపు ద్వారా డిమాండ్‌కు, వినియోగానికి తద్వారా వృద్ధికి ఊపును ఇవ్వవచ్చని ఆయా వర్గాలు కోరుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణం భయాలతో ఆర్‌బీఐ మరింత రెపో తగ్గించడానికి వెనుకాడుతోంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్. ఫిబ్రవరి నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్‌బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గుచూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్‌బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది.
ఎకానమీ ప్రగతిబాట!
Published Sat, Feb 13 2021 5:49 AM | Last Updated on Sat, Feb 13 2021 6:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment