![New Telecom Bill Approves In 10 Months Says Communication Minister - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/24/Untitled-2_0.jpg.webp?itok=LCTXDqnG)
న్యూఢిల్లీ: దాదాపు 137 ఏళ్ల పాత ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ స్థానంలో కొత్త టెలికం బిల్లు 6–10 నెలల్లో అమల్లోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వమేమీ తొందరపడటం లేదని పేర్కొన్నారు. ‘చర్చల ప్రక్రియ బట్టి తుది ముసాయిదా రూపొందుతుంది. ఆ తర్వాత అది వివిధ ప్రక్రియలు పూర్తి చేసుకుని పార్లమెంటు ముందుకు వెడుతుంది. ఇందుకోసం 6–10 నెలల పట్టొచ్చు. మేము ఏమీ తొందరపడటం లేదు‘ అని వైష్ణవ్ చెప్పారు.
కొత్త టెలికం బిల్లు గానీ ఆమోదం పొందితే ఇంటర్నెట్ కాలింగ్, మెసేజీ సర్వీసులు అందించే వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలు కూడా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలంటే టెలికం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా యాప్స్ నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ‘వివిధ ప్లాట్‌ఫాంల ద్వారా కాల్స్ చేయగలిగినప్పుడు అవన్నీ కూడా ఏదో ఒక నియంత్రణ సంస్థ పరిధిలో ఉండాలి.
భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆలోచన ఉంది. టెక్నాలజీ తీసుకొచ్చిన అనేకానేక మార్పుల వల్ల వాయిస్ కాల్, డేటా కాల్ మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది‘ అని వైష్ణవ్ తెలిపారు. యూజర్ల రక్షణని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని బిల్లు రూపొందిందని ఆయన పేర్కొన్నారు. అలాగే యూజర్లు కూడా ఆపరేటర్ల నుంచి సర్వీసులు పొందేందుకు సరైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పుడు వివరాలు ఇస్తే ఏడాది వరకూ జైలు శిక్ష విధించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment