సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంజినీరింగ్,ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 74.90కు చేరడం, ఫార్మా కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం.... సానుకూల ప్రభావం చూపించాయి.
వరుసగా మూడో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు సగం మేర తగ్గిపోయాయి. ఇంట్రాడేలో 390 పాయింట్ల వరకూ ఎగిసిన సెన్సెక్స్ చివరకు 142 పాయింట్ల లాభంతో 38,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 11,270 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
► లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 5 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► ఈ జూన్ క్వార్టర్‌లో నికర లాభం 81 శాతం ఎగియడంతో దివీస్ ల్యాబ్స్ షేర్ 12 శాతం లాభంతో రూ. 3,117 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,228ను తాకింది. ఈ షేర్‌తో పాటు పలు ఫార్మా షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇప్కా ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. ఎస్‌ఆర్‌ఎఫ్, వీఎస్‌టీ టిల్లర్స్, వాబ్‌కో ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
రక్షణ రంగ షేర్లు రయ్..!
వందకు పైగా రక్షణ రంగ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రక్షణ రంగ షేర్లు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.465ను తాకిన భారత్ డైనమిక్స్ షేర్ చివరకు శాతం లాభంతో రూ.437 వద్ద ముగిసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ తదితర షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment