
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో భాగమైన ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్‌ను ఈ ఏడాది జూలైలో దేశీ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 400 నగరాల్లో ఒక లక్ష చార్జింగ్ పాయింట్లతో ’హైపర్‌చార్జర్ నెట్‌వర్క్’ను నెలకొల్పడంపై కసరత్తు చేస్తున్నట్లు ఓలా చైర్మన్ భవీష్ అగర్వాల్ తెలిపారు. ‘జూన్ నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. ప్రాథమికంగా దీని సామర్థ్యం 20 లక్షల యూనిట్లుగా ఉంటుంది. తర్వాత ఏడాది కాలంలో దీన్ని పెంచుకుంటాం. దాదాపు ఫ్యాక్టరీ ఏర్పాటైన తర్వాత నుంచి.. అంటే జూలై నుంచి అమ్మకాలు మొదలుపెడతాం’ అని ఆయన వివరించారు. అయితే, దీని ధర ఎంత
ఉంటుందన్నది మాత్రం వెల్లడించలేదు.
హైపర్‌చార్జర్ నెట్‌వర్క్..
‘ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే చార్జింగ్ నెట్‌వర్క్ పటిష్టంగా ఉండటం ముఖ్యం. మేం ఏర్పాటు చేసే హైపర్‌చార్జర్ నెట్‌వర్క్ ద్విచక్ర వాహనాలను అత్యంత వేగంగా చార్జ్ చేసేదిగా ఉంటుంది‘ అని అగర్వాల్ చెప్పారు. తొలి ఏడాదిలో 100 నగరాల్లో 5,000 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్ ఓలా స్కూటర్ బ్యాటరీ సామర్థ్యంలో 50 శాతాన్ని కేవలం 18 నిమిషాల్లో చార్జింగ్ చేయగలిగేదిగా ఉంటుందని, 75 కి.మీ. దూరం ప్రయాణానికి సరిపోగలదని అగర్వాల్ వివరించారు. మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్సులు, కెఫేలు మొదలైన చోట్ల ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు దగ్గర్లో ఉండేలా చార్జింగ్ పాయింట్లను స్టాండ్ ఎలోన్ టవర్లుగా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇతర భాగస్వాములతో కలిసి ఈ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఓలా ఎలక్ట్రిక్ యాప్ ద్వారా చార్జింగ్ పరిస్థితిని కస్టమర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, చెల్లింపులు కూడా యాప్ ద్వారానే చేయొచ్చని అగర్వాల్ చెప్పారు. ఈ మొత్తం వ్యవస్థపై వచ్చే అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు రావచ్చని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment