
బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నేడు(నవంబర్ 17) నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రత్యేక ఆర్డర్ అందుకున్నట్లు తెలిపింది. నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం అధికారుల కోసం 9 కస్టమైజ్డ్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్లను నిర్మిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ తొమ్మిది స్కూటర్లు భారతదేశంలోని నెదర్లాండ్స్ మూడు దౌత్య కార్యాలయాలలో వినియోగించనున్నారు. నెదర్లాండ్స్ అధికారిక రంగు అయిన కస్టమ్ ఆరెంజ్ రంగులలో ఈ స్కూటర్లను తయారు చేస్తున్నారు. నెదర్లాండ్స్ అధికారిక లోగోను కూడా స్కూటర్ మీద ముద్రించింది.. ఓలా ఈ రంగుకు 'డచ్ ఒరాంజే' అనే పేరు పెట్టింది.
ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన అధునాతన ఓలా ఎస్1 ప్రో స్కూటర్లను రాబోయే వారాల్లో న్యూఢిల్లీలోని నెదర్లాండ్స్ ఎంబసీకి, ఓలా కస్టమర్ డెలివరీలను ప్రారంభించిన తర్వాత ముంబై, బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలకు డెలివరీ చేయనున్నారు. భారతదేశం అంతటా ఇప్పుడు టెస్ట్ రైడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 2డబ్ల్యు ఫ్యాక్టరీ అయిన ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ స్కూటర్లను భారతదేశంలో తయారు చేస్తున్నారు. ఇది ఓలా గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. వచ్చే ఏడాది యూరప్, యుకె, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఆసియా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ స్కూటర్లను ప్రారంభించాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది.
(చదవండి: తగ్గేదె లే అంటున్న జియో!)