ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మరో సంచలనం క్రియేట్ చేసింది. తాజాగా టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, ఎడెల్వీస్ తదితర కంపెనీల నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రౌండ్ ఫండింగ్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ 5 బిలియన్ డాలర్ వీలువ కలిగిన కంపెనీల జాబితాలో చేరిన తొలి ఎలక్ట్రిక్ కంపెనీగా నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్ బ్యాంక్ ఇతరుల నుంచి ఇంతే మొత్తాన్ని సేకరించినట్లు ప్రకటించింది.
"ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని సృష్టిస్తోంది. మొత్తం ప్రపంచానికి ఈవీలను భారతదేశం నుంచి ఎగుమతి చేయనున్నాము. ఇప్పటివరకు తయారు చేసిన అత్యుత్తమ స్కూటర్ ఓలా ఎస్1తో మేము మొత్తం స్కూటర్ పరిశ్రమను మార్చాము. ఇప్పుడు మా సృజనాత్మక ఉత్పత్తులను బైక్ ,స్కూటర్లతో పాటు మరిన్ని వాహనాల కేటగిరీలకు విస్తరించడానికి ఎదురు చూస్తున్నాము" అని ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, "పెట్టుబడిదారుల మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం నుంచి ప్రపంచానికి ఈవీ విప్లవాన్ని పరిచేయడానికి వారితో భాగస్వామ్యం వహించడానికి నేను ఎదురు చూస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ ఏడు సార్లు నిధుల సేకరణ చేపట్టింది. ఇందులో కంపెనీ హ్యుందాయ్ మోటార్ కంపెనీ లిమిటెడ్, టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా, రతన్ టాటాలు పెట్టుబడులు పెట్టినట్లుగా పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నెలలో టెమాసెక్ నేతృత్వంలోని ఫైనాన్సింగ్ రౌండ్ లో కంపెనీ రూ.398.26 కోట్ల(సుమారు 52.7 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఓలా క్యాబ్స్ రైడ్-హైలింగ్ వ్యాపారం తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయడానికి 2017లో స్థాపించిన ఓలా ఎలక్ట్రిక్ కరోనా మహమ్మారి కాలంలో వేగం పుంజుకుంది. ఫిబ్రవరిలో కంపెనీ తన ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్లాంట్ గా పేర్కొంది. ఈ ప్లాంట్ తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఉంది.
(చదవండి: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!)
Comments
Please login to add a commentAdd a comment