
సాక్షి, హైదరాబాద్: కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువుల కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో కారణమేదైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లను కొనేందుకే ఇష్టపడుతుంటారు. సొంతంగా ఉండేందుకు ఇల్లు మొదటి ప్రాధాన్యత పూర్తయితే ఇక వారి లక్ష్యం శివారు ప్రాంతమైనా సరే ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయటమే.
ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వెలిసిన వెంచర్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2018 నుంచి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, గుర్గావ్ నగరాలలో ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని హౌసింగ్.కామ్ సర్వే వెల్లడించింది.
గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇదే నగరాల్లోని అపార్ట్‌మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.
కరోనాతో బూస్ట్..: సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్‌మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు.
కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్‌మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment