ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్‌లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.
మొదటగా మీరట్ నుంచి..
మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.
పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.
సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment