పేటీఎంకు గూగుల్‌ షాక్‌! | Paytm app removed from Google Play Store for hours | Sakshi
Sakshi News home page

పేటీఎంకు గూగుల్‌ షాక్‌!

Published Sat, Sep 19 2020 5:15 AM | Last Updated on Sat, Sep 19 2020 8:04 AM

Paytm app removed from Google Play Store for hours - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ను తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్‌పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్‌బ్యాక్‌’ ఫీచర్‌ను పేటీఎం తొలగించడంతో యాప్‌ను సాయంత్రానికి గూగుల్‌ మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

గూగుల్‌ నిబంధనలకు అనుగుణంగా క్యాష్‌బ్యాక్‌ కింద ఆఫర్‌ చేస్తున్న స్క్రాచ్‌ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్‌ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్‌ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్‌ వంటి) కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది.

ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్‌ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్‌ శేఖర్‌ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ 19 నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రారంభమవుతోంది. ఐపీఎల్‌ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్‌ యాప్స్‌ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.  

అంతకు ముందు ఏం జరిగిందంటే...
ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్‌ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్‌ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్‌ను బ్లాక్‌ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్‌ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్‌ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం  ..  ప్లే స్టోర్‌లో కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు, అప్‌డేట్‌ చేసుకునేందుకు తమ యాప్‌ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే, యాప్‌ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది.   

క్రికెట్‌ లీగ్‌ తెచ్చిన తంటా..
క్రికెట్‌ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్‌ యాప్‌లో ఇటీవల ’పేటీఎం క్రికెట్‌ లీగ్‌’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్‌ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్‌ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్‌ భారత్‌లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్‌ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ను తొలగించింది‘ అని వివరించారు.  

బెట్టింగ్‌ యాప్స్‌ అన్నీ తొలగింపు..
క్రీడలపై బెట్టింగ్‌ చేసే యాప్స్‌ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తామని గూగుల్‌ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్‌ యాప్స్, ఆన్‌లైన్‌ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్‌ప్లే డెవలపర్‌ అకౌంట్‌ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్‌ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్‌ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్‌ లీగల్‌ అండ్‌ అసోసియేట్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సోనం చంద్వానీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement