
సాక్షి, విశాఖపట్నం: హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పల్సస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. వైజాగ్‌లోని మధురవాడ ఐటీ పార్క్‌లో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ సిద్ధమవుతోందని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీను బాబు సోమ వారం పేర్కొన్నారు. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత సెజ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా వెల్లడించారు. ‘ఓమిక్స్ ఇంటర్నేషనల్, కాన్ఫరెన్స్ సిరీస్ వంటి ప్రధాన సంస్థలను స్థాపించాం. మీటింగ్స్ ఇంటర్నేషనల్, పల్సస్, అలైడ్ అకాడమీలు, యూరోసికాన్, లాంగ్‌డమ్, లెక్సిస్, హిలారిస్ మొదలైన బ్రాండ్లను సొంతం చేసుకున్నాం. వేలాది ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య, విజ్ఞాన, ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులకు సమాచార వేదికను ఏర్పాటు చేశాం. మూడేళ్ల క్రితం ఏర్పాటై విజయవంతంగా నడుస్తోన్న విశాఖ పల్సస్ యూనిట్‌లో ఒక్క 2021లోనే సుమారుగా 3,500 వెబినార్లు నిర్వహించి.. 700 జర్నల్స్ ప్రచురించాం. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థ పల్సస్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. 15,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడం మా విజయం అని ప్రకటిస్తున్నాం’ అని తెలిపారు.