న్యూఢిల్లీ: జీ గ్రూప్ సంస్థల్లో కీలక హోదాలు చేపట్టరాదన్న సెబీ ఆదేశాల విషయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీల్) మాజీ చీఫ్ పునీత్ గోయెంకాకు సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో చుక్కెదురైంది. సెబీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు శాట్ నిరాకరించింది.
ఈ అంశంపై తన సమాధానాన్ని సెప్టెంబర్ 4లోగా తెలియజేయాలంటూ సెబీకి సూచించింది. తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. కంపెనీ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారంటూ జీల్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు గోయెంకాలపై అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, వారు జీ గ్రూప్‌లోని నాలుగు సంస్థలకు, అలాగే జీల్–సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విలీనంతో ఏర్పడే సంస్థలోనూ డైరెక్టర్లుగా గానీ కీలక నిర్వహణ హోదాల్లో (కేఎంపీ) గానీ ఉండరాదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ పునీత్ గోయెంకా .. శాట్‌ను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment