ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలుగా ప్రారంభమైనవే. ఈ కోవకు చెందిన వాటిలో ఒకటి 'వడిలాల్ ఐస్‌క్రీమ్' కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ 'వడిలాల్ గాంధీ'. ఇంతకీ ఈయన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన 'వడిలాల్ గాంధీ' 1907లో అహ్మదాబాద్‌లోని ఒక చిన్న ఫౌంటెన్ సోడా దుకాణం ప్రారంభించారు. ఆ తరువాత సోడా విక్రయించడం ప్రారంభించారు. క్రమక్రమంగా.. గుజరాత్‌లో ఈయన దుకాణానికి ఆదరణ పెరిగింది. ఆ తరువాత సోడాతో పాటు ఐస్‌క్రీమ్ విక్రయించడం ప్రారంభించారు.
వడిలాల్ గాంధీ ప్రారంభించిన ఐస్‌క్రీమ్ షాప్ బాగా అభివృద్ధి చెందింది. 1926లో ఈయన దేశంలోనే మొట్టమొదటి ఐస్‌క్రీమ్ అవుట్‌లెట్ స్థాపించారు. ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని విస్తరించడానికి అప్పట్లో జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత వడిలాల్ గాంధీ కుమారుడు రాంచోడ్ లాల్ గాంధీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.
1970 నాటికి అహ్మదాబాద్‌లో మొత్తం 10 వడిలాల్ అవుట్‌లెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అప్పట్లో రాంచోడ్ లాల్ కుమారులు రామచంద్ర, లక్ష్మణ్ గాంధీలు నిర్వహించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ కంపెనీ వండిన కూరలు, రొట్టెలు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విక్రయించింది.
ప్రస్తుతం వడిలాల్ కుటుంబానికి చెందిన ఐదవ తరం వ్యక్తి 'కల్పిత్ గాంధీ' కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఐస్‌క్రీమ్ విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది.
1907లో ఓ వీధి దుకాణంగా ప్రారంభమైన వడిలాల్ కంపెనీ నేడు ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అయిపోయింది. ప్రస్తుతం వడిలాల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 30,00,00,00,000. దీన్నిబట్టి చూస్తే.. వీధి పక్కన ఓ చిన్న షాపుగా ప్రారంభమై నేడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment