కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్‌సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.
మీ గురించి చెప్పండి
నా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్‌సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.
గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.
ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?
ఎగ్‌సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.
గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?
అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్‌సలెంట్ ఎగ్‌స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.
ఎగ్‌సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్‌కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.
ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్‌సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.
ఎగ్‌సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?
భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్‌సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.
ఎగ్‌సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?
ఎగ్‌సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment