న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది.
మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్‌ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment