మళ్లీ ఐపీవోలకు కంపెనీల క్యూ | The queue of companies for IPOs again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఐపీవోలకు కంపెనీల క్యూ

Published Thu, Jul 8 2021 2:39 PM | Last Updated on Thu, Jul 8 2021 2:39 PM

The queue of companies for IPOs again - Sakshi

దాదాపు రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్‌ ఇకపై మరింత సందడి చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు ఇటీవల 30  కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరో 10 కంపెనీలు అనుమతులు పొంది ఈ నెలలో    ఐపీవోలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఐపీవో మార్కెట్‌పై మర్చంట్‌ బ్యాంకర్లు   అందించిన వివరాలిలా..    

సాక్షి ,ముంబై: ఓవైపు ప్రతీ వారంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ జోరుగా సాగుతున్నాయి. మరోపక్క పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 22 కంపెనీలు ఉమ్మడిగా రూ. 27,426 కోట్లను సమీకరించగా.. ఇకపై మరో 10 కంపెనీలు ఈ నెలలోనే పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 25,000 కోట్లవరకూ సమకూర్చుకోనున్నాయి. ఈ బాటలో మరో 30 కంపెనీలు ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేశాయి. తద్వారా రూ. 55,000 కోట్లను పొందేందుకు ప్రణాళికలు వేశాయి. వెరసి సమీప భవిష్యత్‌లో 40 కంపెనీలు రూ. 80,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు వేదికకానున్నాయి. భారీ లిక్విడిటీ, కొత్తగా జత కలుస్తున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. 2020లో 16 ఇష్యూలు రూ. 26,628 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా 2019లో రూ. 12,687 కోట్లు సమీకరించగా.. 2018లో 25 కంపెనీలు అత్యధికంగా రూ. 31,731 కోట్లను సమీకరించాయి.    

ఎఫ్‌పీఐల దన్ను 
దేశీయంగా గతేడాది(2021) విదేశీ ఫండ్స్‌ సరికొత్త రికార్డును సృష్టిస్తూ 35 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ ఏడాదిలోనూ ట్రెండ్‌ కొనసాగే వీలుంది. వీటికి జతగా ఎల్‌ఐసీ తదితర దేశీ ఫండ్స్‌ సైతం కోట్లను కుమ్మరిస్తున్నాయి. ఈ బాటలో ఈ ఏడాది కొత్తగా 2 కోట్లమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించారు. కాగా.. జనవరి–మార్చి మధ్య ఐఆర్‌ఎఫ్‌సీ, ఇండిగో పెయింట్స్, రైల్‌టెల్, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్, లక్ష్మీ ఆర్గానిక్స్, బార్బిక్యూ నేషన్, అనుపమ్‌ రసాయన్, కల్యాణ్‌ జ్యువెలర్స్, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రీట్, స్టవ్‌ క్రాఫ్ట్‌ తదితరాలు ఐపీవోలను చేపట్టాయి. ఉత్కర్‌‡్ష స్మాల్‌ బ్యాంక్, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్, రోలెక్స్‌ రింగ్స్, సెవెన్‌ ఐలాండ్‌ షిప్పింగ్‌ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందాయి.  
పేటీఎమ్‌ 
డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌ రూ. 18,500 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. తద్వారా 2010 అక్టోబర్‌లో వచ్చిన అతిపెద్ద ఇష్యూ కోల్‌ ఇండియా(రూ. 15,000 కోట్లు)ను అధిగమించే వీలుంది. కాగా.. ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీల జాబితాలో ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఫిన్‌కేర్‌ స్మాల్‌ బ్యాంక్, జానా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, న్యువోకో విస్టాస్, కార్‌ట్రేడ్, ఆరోహణ్‌ ఫైనాన్షియల్, శ్రీరామ్‌ ప్రాపర్టీస్, సన్సేరా ఇంజినీరింగ్, సుప్రియా లైఫ్‌సైన్సెస్‌ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement