న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది.
ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం.
♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది.
♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది,
♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది.
♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది.
Comments
Please login to add a commentAdd a comment