హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 517–542గా నిర్ణయించినట్లు పిల్లల ఆస్పత్రుల చెయిన్ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,581 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ రమేష్ కంచర్ల శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పరిస్థితులను బట్టి ఇతర పొరుగు దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఐపీవో కింద కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా రూ. 280 కోట్లు సమీకరించనుండగా .. ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో 2.4 కోట్ల వరకూ షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1,500గా ఉన్న పడకల సంఖ్యను వచ్చే మూడేళ్లలో మరో 500 మేర పెంచుకోనున్నట్లు సీఎఫ్‌వో ఆర్ గౌరీశంకర్ పేర్కొన్నారు. రెయిన్‌బో ఐపీవో ఏప్రిల్ 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఇష్యూలో 35 శాతం భాగాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లు కంపెనీ కేటాయిస్తోంది. వారికి ఇష్యూ తుది ధరపై రూ. 20 డిస్కౌంటు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment