రెండేళ్లలో భారీగా పెరిగిన ఆర్‌బీఐ పసిడి నిల్వలు | RBI Gold Reserves Have Increased By 27 PC in the last 2 years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో భారీగా పెరిగిన ఆర్‌బీఐ పసిడి నిల్వలు

Published Thu, Sep 9 2021 2:48 PM | Last Updated on Thu, Sep 9 2021 2:51 PM

RBI Gold Reserves Have Increased By 27 PC in the last 2 years - Sakshi

అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన పసిడి నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది. 2021 క్యాలెండర్‌ ఇయర్‌ మొదటి ఆరు నెలల్లో(జనవరి-జూన్‌) రికార్డు స్థాయిలో 29 టన్నులు కొనుగోలు చేసింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఆర్‌బీఐ పసిడి నిల్వలు 27 శాతం పెరగడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్వహణలో ఉండే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా ఉండే పసిడి పరిమాణం 2021 జూన్‌ 30 నాటికి 705.6 టన్నులకు చేరింది. 2018 ప్రారంభంలో ఈ పరిమాణం 558.1 టన్నులు. (చదవండి: ఇక ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!)

ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్‌ నిల్వల్లో 2021 ఆగస్టు 27తో ముగిసే త్రైమాసికానికి పసిడి వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, ఆగస్టు 27వ తేదీతో ముగిసిన వారంలో(అంతక్రితం ఆగస్టు 22తో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయిలో 633.558 బిలియన్‌ డాలర్లకు(దాదాపు రూ.46 లక్షల కోట్లు) చేరాయి. ఇందులో పసిడి నిల్వల వాటా 37.441బిలియన్‌ డాలర్లు. ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చూస్తే..

  • 705 టన్నులకుపైగా పసిడి నిల్వలతో భారత్‌ ఈ విషయంలో 9వ ర్యాంక్‌లో నిలుస్తోంది. 
  • ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం 2021 జూన్‌లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు 32 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. ఇందులో ఆర్‌బీఐ వాటా ఒక్కటీ చూస్తే, 30 శాతం ఉంది. అంటే దాదాపు 9.4 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది.  
  • ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్ల గణాంకాలను పరిశీలిస్తే, 2009 నవంబర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ నుంచి భారీగా 200 టన్నులను కొనుగోలు చేసింది. 2018 మార్చిలో 2.2 టన్నులను కొంది. 2021లో ఒకేసారి 9.4 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది.  
  • ఈ విషయంలో ఆర్థిక నిపుణులు తెలుపుతున్న సమాచారం ప్రకారం, దాదాపు దశాబ్దం తర్వాత గడచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇతర సెంట్రల్‌ బ్యాంకుల బాటలోనే ఆర్‌బీఐ కూడా పసిడి కొనుగోళ్లపై దృష్టి సారించింది.  
  • 2018 మార్చి నుంచి భారత్‌ పసిడి నిల్వలకు దాదాపు 147 టన్నులు (26.6%) జతయ్యాయి.  
  • 2018 క్యాలెండర్‌ ఇయర్‌ నుంచి ఆర్‌బీఐ ప్రతి సంవత్సరం సగటున 39.5 టన్నుల పసిడిని కొనుగోలు చేస్తోంది. 2021 తొలి ఆరు నెలల్లోనే ఈ కొనుగోళ్లు 29 టన్నులు. గడచిన మూడు సంవత్సరాలు మొదటి ఆరు నెలల్లో కొనుగోలు చేసిన సగటుకన్నా ఇది ఎంతో అధికం.  
  • 2018లో ఆర్‌బీఐ మొత్తం 42.3 టన్నుల పసిడి కొనుగోళ్లలో మొదటి ఆరు నెలల్లో కొన్నది 8.1 టన్నులు. 2019లో వరుసగా ఈ అంకెలు 34.5 టన్నులు, 17.7 టన్నులు. 2020లో ఈ సంఖ్య లు వరుసగా 41.7, 26.4 టన్నులుగా ఉన్నాయి.  
  • సావరిన్‌ క్రెడిట్‌ వర్తీనెస్‌ను సంరక్షించుకోడానికి పసిడి నిల్వలు కీలకమైనవని నిపుణులు పేర్కొంటున్నారు.  

ప్రయోజనాలు ఎన్నో..
సెంట్రల్‌ బ్యాంక్‌ పసిడి నిల్వలపై మేము పరిశోధన చేశాం. ఇది ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూర్చే అంశం. ఇక్కడ మనం అంతర్జాతీయ తీవ్ర అనిశ్చిత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే దేశాల రుణ భారాలను పరిశీలించాలి. ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం వంటి ఎన్నో సమస్యలు ప్రపంచ దేశాల్లో కనిపిస్తాయి. ఆయా సమస్యల పరిష్కారాల్లో పసిడి నిల్వలు కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే ఆర్థిక సంక్షోభాల సమయంలో సావరిన్‌ క్రెడిట్‌ డిఫాల్డ్‌ స్వాప్‌ (సీడీఎస్‌) సమస్యలను అధిగమించడానికి బంగారం ఎంతగానో దోహదపడుతుంది. - ఐఐఎం, అహ్మదాబాద్‌  పరిశోధనా నివేదిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement