ముంబై: బ్యాంకింగ్‌లో క్లెయిమ్ చేయని నిధుల మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు ఎగశాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం తెలుగురాష్ట్రాలుసహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్‌లు జాబితాలో ఉన్న మిగిలిన ప్రధాన రాష్ట్రాలు. దీనితో ఈ అంశంపై ఆయా రాష్ట్రాల్లో విస్తృత ప్రాతిపదికన ప్రచారం నిర్వహించి, క్లెయిమ్ చేయని వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు బ్యాంకింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
క్లెయిమ్ చేయని నిధులు అంటే..
సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, 10 సంవత్సరాల పాటు ఎవ్వరూ నిర్వహించని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను ‘ క్లెయిమ్ చేయని డిపాజిట్లు‘గా వర్గీకరిస్తారు. ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్’కి బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేపట్టినప్పటికీ, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతున్న ధోరణి కనబడ్డం గమనించాల్సిన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కారణాలు ఏమిటి?
క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం ప్రధానంగా సేవింగ్స్, కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల పెరుగుతోంది. డిపాజిటర్లు కొద్దో గొప్పో బ్యాంక్ ఖాతాల్లో వదిలివేసి ఆపరేట్ చేయకూడదనుకోవడం లేదా మెచ్యూర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్ క్లెయిమ్‌లను సమర్పించకపోవడం వంటి అంశాలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని సందర్భాల్లో మరణించిన డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల విషయంలో నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు డబ్బును వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. క్లెయిమ్ చేయడంలో సహాయపడటం తమ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
చదవండి: EV: ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం!
Comments
Please login to add a commentAdd a comment