RBI May Reduce Policy Rate In Fourth Quarter Of 2024: Oxford Economics - Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రుణరేటు తగ్గే అవకాశం! అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం అంచనా

Published Tue, May 30 2023 8:53 AM | Last Updated on Tue, May 30 2023 10:21 AM

RBI may cut policy rate in fourth quarter of 2024 Oxford Economics - Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) కీలక రుణ రేటు– రెపోను (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6.5 శాతం) తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం– ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 

‘‘రుణ రేటు తగ్గింపునకు తగిన వాతావరణం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఆర్థిక వ్యవస్థలో సరళతర పరిస్థితిని తీసుకురావడానికి ఆర్‌బీఐ ఉపయోగించుకునే వీలుంది’’ అని విశ్లేషించింది. 2022 నవంబర్, డిసెంబర్‌ మినహా 2022 జనవరి నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న– రెండంకెల పైనే కొనసాగింది. ఈ నేపథ్యంలో గత ఏడాది మే వరకూ 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్‌బీఐ 2.5 శాతం పెంచింది. అంటే ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి రిటైల్‌ ద్రవ్యోల్బణం తగుతున్న పరిస్థితి కనబడుతోంది.  

ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయంపై ఆసక్తి... 
ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో జరిగిన 2023–24 తొలి ద్వైమాసిక సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అందరి అంచనాలకు భిన్నంగా యథాతథ రెపో రేటును కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంపై విశ్లేషకులు ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.   11 నెలల వరుస రేటు పెంపు అనంతరం ఆర్‌బీఐ ఎంపీసీ తీసుకున్న నిర్ణయం విశ్లేషకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం.  నిజానికి ఈ దఫా రేటు పావుశాతం వరకూ ఉంటుందని మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు అంచనావేశారు.  

ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరిలో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఆర్‌బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరిలో అంచనా వేస్తే, ఏప్రిల్‌ మొదటి వారం సమీక్షలో  ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. అయితే ద్రవ్యోల్బణంపై పోరు ముగిసిపోలేదని ఆర్‌బీఐ స్పష్టం చేయడం మరో విశేషం.  

‘‘ఇది కేవలం విరామం మాత్రమే.ఈ నిర్ణయం –కేవలం ఈ సమావేశానికి మాత్రమే–  అవసరమైతే మళ్లీ రేటు పెంపు ఉంటుంది. అంతర్జాతీయ అంశాలను, ద్రవ్యోల్బణం కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యతపై ప్రస్తుతానికి దృష్టి సారించడం జరుగుతోంది.  ఆర్‌బీఐ అంచనాలకు ఊతం ఇస్తూ,  18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్‌ మినహా 2022 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి  కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్‌ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది.  ఇవన్నీ రేటు తగ్గింపునకు దారితీసే అంశాలని నిపుణులు భావిస్తున్నారు.  

హెచ్‌ఎస్‌బీసీ, నోమురా... ఇదే వైఖరి
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని మరికొందరు నిపుణులూ భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్‌బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని  మేము భావిస్తున్నా ము‘ అని విదేశీ బ్రోకరేజ్‌ హెచ్‌ఎస్‌బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్‌లో తెలిపారు. 

4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ,  ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యేయంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్‌బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లే షించారు. జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నోమురా కూ డా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్‌ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది.

ఇదీ చదవండి: బ్యాంకింగ్‌ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement