నిమిషాల్లో వేడి ఆహారం ‘రెడీ’ | Ready to cook food sales rise as India gives stay-at-home | Sakshi
Sakshi News home page

నిమిషాల్లో వేడి ఆహారం ‘రెడీ’

Published Thu, Mar 11 2021 5:28 AM | Last Updated on Thu, Mar 11 2021 12:33 PM

Ready to cook food sales rise as India gives stay-at-home - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  కోవిడ్‌-19 కారణంగా ప్రతి ఇంటా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఆహారం విషయంలో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోటళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్‌ తెప్పించే బదులు ఇంటి వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సౌకర్యం కోరుకునే యువత రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ ఉత్పత్తుల వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం, ఆన్‌లైన్‌ క్లాసులు వెరశి ఈ ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నాయి. కంపెనీలు సైతం భారతీయ రుచులను అందిస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. కోవిడ్‌–19 చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ మార్కెట్‌కు మాత్రం ఇది కలిసి వచ్చింది. విమానాల్లో మాదిరిగా రైలు ప్రయాణికులకు సైతం బ్రాండెడ్‌ కంపెనీల రెడీ టు ఈట్‌ ఆహారం త్వరలో అందుబాటులోకి రానుంది. (వీడియోకాలింగ్‌ ఫీచర్‌తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?)

సౌకర్యవంతం కావడంతో..: కొన్నాళ్ళుగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకుతోడు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుదలతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో రెడీ టు కుక్, రెడీ టు ఈట్‌ ఉత్పత్తులకు విపరీత డిమాండ్‌ వచ్చింది. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగుతుందని అమ్మమ్మాస్‌ బ్రాండ్‌తో రెడీ టు కుక్‌ రంగంలో ఉన్న  హైదరాబాద్‌ కంపెనీ మంగమ్మ ఫుడ్స్‌ ఎండీ ప్రతిమ విశ్వనాథ్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఇంటి వంట కోసం వినియోగదారుల వ్యయం 61% పెరిగిందని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ చెబుతోంది. అసోచాం సర్వే ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో సమయాభావం కారణంగా రెడీ టు ఈట్‌ ఆహారానికి 79% ప్రాధాన్యత ఇస్తున్నాయి. రుచిలో ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడం, సులభంగా వండుకోవడానికి, తినడానికి సౌకర్యంగా ఉండడం ఈ ఉత్పత్తుల ప్రత్యేకత.

పుట్టుకొస్తున్న కంపెనీలు: రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే దాదాపు అన్ని కంపెనీలు కూడా స్థానికంగా పాపులర్‌ అయిన ఉత్పత్తులను ఆఫర్‌ చేస్తుండడం విశేషం. ఎంటీఆర్, గిట్స్, టేస్టీ బైట్, ఐటీసీ కిచెన్స్‌ ఆఫ్‌ ఇండియా, టాటా క్యూ, ద టేస్ట్‌ కంపెనీ, జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్, అదానీ విల్మర్, లిషియస్, అమూల్, హల్దీరామ్స్‌ తదితర కంపెనీలు ప్రధానంగా ఈ రంగంలో పోటీపడుతున్నాయి. కాగా, దేశంలో 71 శాతం ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారని అంచనా. అయితే ప్రస్తుత ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ సంస్థలు వీరి కోసం ఏమీ చేయలేకపోయాయి. ఈ విషయంలో హైదరాబాద్‌కు చెందిన ద టేస్ట్‌ కంపెనీ దేశంలోనే తొలిసారిగా మాంసాహార ఉత్పత్తులను అందిస్తోంది. వీటి తయారీకి ఎంతో శ్రమించామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని ద టేస్ట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు రాజు వనపాల తెలిపారు. (ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట)

ఫాస్ట్‌ ఫుడ్‌ను మించి..
రెడ్‌సీర్‌ ప్రకారం రెడీ టు కుక్‌ ఉత్పత్తుల మార్కెట్‌ 2019లో రూ.2,100 కోట్లుంది. సగటున 18 శాతం వార్షిక వృద్ధితో ఇది  2024 నాటికి రూ.4,800 కోట్లకు చేరనుంది. రూ.8,000 కోట్లున్న రెడీ టు ఈట్‌ ప్రొడక్ట్స్‌ విపణి వచ్చే అయిదేళ్లలో రెండింతలు కానుంది. ఇన్‌స్టాంట్‌ నూడుల్స్‌ మార్కెట్‌ విలువ రూ.10,000 కోట్లుగా ఉంది. స్విగ్గీ రిపోర్టు ప్రకారం 2019, 2020లో భారతీయులు పిజ్జా, పాస్తా, నూడుల్స్‌ బదులుగా ఎక్కువగా బిర్యానీ, మసాలా దోశ, దాల్‌మఖనీని ఆర్డర్‌ చేశారు. భారతీయ ఫుడ్‌తో ఇక్కడి కస్టమర్లకు అనుబంధం ఉండడంతో రెడీ టు ఈట్‌ బ్రేక్‌ ఫాస్ట్, మీల్‌ మార్కెట్‌ రానున్న కొన్ని ఏళ్లలో ఫాస్ట్‌ ఫుడ్‌ మార్కెట్‌ను మించిపోవడం ఖాయంగా కనపడుతోంది.  (నగ్నంగా బైక్‌పై హల్‌చల్‌ : పోలీసుల వేట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement