డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? – మంజనాథ్
డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కాదు. ఫండ్ సంస్థ డివిడెండ్ ప్రకటించినప్పటికీ అది ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల డివిడెండ్ ఆదాయాన్ని కూడా చూపించి పన్ను చెల్లించాల్సిందే. ఇన్వెస్టర్లు తమకు వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్ ప్లాన్ మెరుగైన ఎంపిక అవుతుంది.
పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ కంది
రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లు అయితే ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టింపు కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా కొనసాగొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి.
ఇటీవలి కరోనా కొత్త రకం ముప్పు నేపథ్యంలో నా పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండాలి? ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడి మార్చుకోవాలా? – రమాకాంత్
ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను పూర్తిగా మార్చుకోవద్దు. 2020 మార్చిలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. మార్కెట్ అదే పనిగా పడిపోయింది. దీంతో చాలా మంది భయపడి పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. ఆ తర్వాత అసాధారణమైన లాభాలను చూశాం. ఈక్విటీలను ఊహించడం కష్టం. అవి ఎప్పుడూ అస్థిరంగా, అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే, వచ్చే ఐదేళ్లపాటు పెట్టుబడితో అవసరం లేకుంటే, కరెక్షన్ గురించి భయపడాల్సిన పనిలేదు. దీనికి బదులు మీరు అస్సెట్ అలోకేషన్ ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపులను నిర్ణయించుకోండి. డెట్‌లో 30 శాతం పెట్టుబడులను ఉంచాలనుకుంటే.. మొత్తం పెట్టుబడుల్లో ఆ మేరకు డెట్ విభాగంలోకి మళ్లించండి. దాంతో ఏదైనా అసాధారణ మార్పులు చోటు చేసుకుంటే అస్సెట్ అలోకేషన్ ప్రణాళిక మేరకు ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులను రీబ్యాలన్స్ చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ,అయితే ఇవి తెలుసుకోండి..
Published Mon, Dec 26 2022 6:49 AM | Last Updated on Mon, Dec 26 2022 6:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment