కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫార్మ్. జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ముమ్మరం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇటీవలనే నెట్‌మెడ్స్ (ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ)ను కొనుగోలు చేసింది. జియోమార్ట్ కోసమే ఈ కొనుగోలు జరిగింది. జయోమార్ట్ కార్ట్‌లో ఆన్‌లైన్ ఫార్మసీతో పాటు భవిష్యత్తులో మరిన్ని విభాగాలు జత చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. మరోవైపు 2019 నుంచి కొంటూ వస్తున్న వివిధ సంస్థలను (గ్రాబ్, ఫైండ్ తదితర సంస్థలు) పూర్తిగా రిలయన్స్ రిటైల్‌లో సమ్మిళితం చేసి జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేయనున్నది. రిలయన్స్ రిటైల్‌కు ఇప్పటికే ట్రెండ్స్, డిజిటల్, జ్యూయల్ విభాగాలున్నాయి.
ప్రస్తుతం రిలయన్స్ జియోమార్ట్ పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్‌ఎమ్‌సీజీ) విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని వ్యాపార విభాగాలు–ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ జత చేయనున్నది. ఫ్యాషన్ స్టార్టప్ జివామెలో రోనీ స్క్రూవాలకు ఉన్న 15 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో మరింత వాటాను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆన్‌లైన్ ఫర్నీచర్ సంస్థ, అర్బన్ ల్యాడర్‌ను, గ్రోసరీ డెలివరీ సంస్థ మిల్క్ బాస్కెట్‌ను కూడా రిలయన్స్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. (వాటా విక్రయం ఉండదని, త్వరలోనే ఐపీఓకు వస్తామని ఇటీవలే మిల్క్ బాస్కెట్ స్పష్టం చేసింది) ఆన్‌లైన్ సంబంధిత స్టార్టప్‌లను.. కుదిరితే పూర్తిగా కొనేయడమో లేదంటే ఎంతో కొంత వాటానైనా చేజిక్కించుకోవడమో... ఇది రిలయన్స్ జియోమార్ట్ వ్యూహం.
నిధులు పుష్కలం...
గత రెండు నెలల్లో 8.5 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.37,710 కోట్లు సమీకరించింది. జియోమార్ట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు–అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పంట పడింది. మరింత మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం ఈ రెండు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ సంస్థ వంద కోట్ల డాలర్లు కేటాయించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది. సూపర్ మార్కెట్ల చెయిన్‌లో సంచలనం సృష్టించిన డీమార్ట్, దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్(బిగ్‌బాస్కెట్‌లో టాటాలకు వాటా ఉంది) కూడా అన్‌లైన్ గ్రోసరీ మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.
సగం సరుకులు జియోమార్ట్‌వే
ఇటీవలే మొదలైనా జియోమార్ట్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా వేగంగా వృద్ధి చెందే ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌గా అవతరించనున్నది. కార్యకలాపాలు ప్రారంభించి కొద్ది కాలమే అయినప్పటికీ, రిలయన్స్ దన్నుతో ఈ సంస్థ దూసుకుపోతోంది. కొన్నేళ్లలో భారత్‌లో ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే మొత్తం సరుకుల్లో(వస్తువులు)సగం రిలయన్స్ జియోమార్ట్‌వే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం జియోమార్ట్ వాటా 1 శాతంగానే ఉందని, ఐదేళ్లలో ఇది 31 శాతానికి ఎగబాకుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. వాట్సాప్ ద్వారా చెల్లింపులకు ఆమోదం లభించడం జియోమార్ట్‌కు మరింత కిక్‌ను ఇవ్వనున్నది.
(వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ఇటీవలనే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది) ఇక జియోమార్ట్ 1,700 మంది మర్చంట్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 20 నగరాల్లో కిరాణా వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు పోటీ సంస్థలు గ్రోఫర్స్, స్విగ్గీ స్టోర్స్, బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల విస్తరణ అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో రోజుకు నాలుగు లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అంచనా. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా ఆన్‌లైన్ ద్వారా సరుకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఆర్థిక మందగమన కాలంలో ఆకర్షణీయ డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి ఒక కారణం. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్రోసరీ విభాగాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి నిదర్శనం.
జోరుగా యాప్ డౌన్‌లోడ్‌లు...
రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ (గ్రోసరీ), అజియో(దుస్తులు) యాప్‌ల డౌన్‌లోడ్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ యాప్‌ల డౌన్‌లోడ్‌ల కంటే రెట్టింపు జియోమార్ట్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి. డౌన్‌లోడ్‌లు జోరుగా ఉంటే లావాదేవీలు జరిగినట్లు కానప్పటికీ, భవిష్యత్తులో లావాదేవీలు పెరగడానికి ఈ డౌన్‌లోడ్‌లు ఒక సంకేతమని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది.
సరైన బిజినెస్ మోడల్ లేదు...!
ప్రస్తుతం ఈ గ్రోసరీ మార్కెట్లో బిగ్‌బాస్కెట్‌దే పై చేయి. తర్వాతి స్థానంలో గ్రోఫర్స్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సూపర్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌క్విక్ పేరుతో గ్రోసరీలను విక్రయిస్తోంది. అమెజాన్ సంస్థ ప్యాంట్రీ, ఫ్రెష్ సంస్థల ద్వారా సరుకులను అందిస్తోంది. ప్రస్తుతానికి జియోమార్ట్‌తో బిగ్‌బాస్కెట్‌కు, గ్రోఫర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, భవిష్యత్తులో మాత్రం ఈ రెండు కంపెనీలకు జియోమార్ట్ గట్టిపోటీనే ఇచ్చే అవకాశాలున్నాయి. భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడంతో మార్జిన్లు తక్కువగా ఉండటం, సరఫరా, డెలివరీ తదితర సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏ సంస్థకూడా ఈ గ్రోసరీ సెగ్మెంట్లో సరైన ‘బిజినెస్ మోడల్’ను ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే ఈ సంస్థల వద్ద పుష్కలంగా నిధులు ఉండటంతో ఇవి వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment