
పదవీ విరమణ అంటే కొందరికి సంతోషం, ఇంకొందరికీ భయం కలుగుతుంది. ఆర్థిక అవసరాలకు సరిపడే డబ్బును సమకూర్చుకున్నవారికి అది ఆనందం అయితే..ఎలాంటి పెట్టుబడులు, మిగులు లేనివారికి రిటైర్‌మెంట్ నరకమే. ఇటీవల ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారని తేలింది. అయితే ముందు నుంచి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని మదుపు చేస్తే పదవీ విరమణ తర్వాత సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మానవ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో చాలామందికి తమ తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు పనిచేస్తున్నంత కాలం ఏదో కొంత డబ్బు సంపాదిస్తున్నారు కదా అని భరిస్తున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో పెరిగే అనారోగ్యంతో ఆర్థిక, మానసిక స్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపాలంటే కొన్ని నియమాలు పాటించాలి.
పక్కా ప్రణాళిక
పదవీ విరమణ తర్వాత ఆదాయం నిలిచిపోతుంది. ఏటా ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. మనుషులు ఆయుర్ధాయం అధికమవుతుంది. పనిచేస్తున్నపుడే పొదుపు పాటించాలి. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దాంతో రిటైర్‌మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు..వంటి ఖర్చులను భరించడానికి పొదుపు చాలా అవసరం. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేపుడు మీ జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తు అవసరాలు, మీపై ఆధారపడినవారు, కుటుంబానికి చేయాల్సిన ప్రధాన బాధ్యతలు..వంటివి పరిగణనలోకి తీసుకుని పొదుపు చేయాలి.
పెరుగుతున్న ఆయుర్ధాయం
మారుతున్న ఆహార అలవాట్లు దృష్ట్యా చాలామందికి చిన్న వయసులోని బీపీ, షుగర్, కిడ్నీ..సమస్యలు మొదలవుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్యలు తీవ్రరూపం దాలుస్తాయి. దాంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ప్రస్తుతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. కానీ అందుకు డబ్బు కావాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే అంచనా వేసి తగిన కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
పెట్టుబడి ఎక్కడ చేయాలంటే..
పదవీ విరమణ ప్రణాళిక కోసం వివిధ పెట్టుబడి మార్గాలున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) వంటి స్థిరంగా రాబడినిచ్చే పథకాలున్నాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా అధిక రాబడి ఉంటుంది. ఈక్వీటీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో మదుపు చేయవచ్చు.
ఇదీ చదవండి: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
తొందరపడండి
పదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుగానే మదుపు చేయడం ప్రారంభించాలి. రిటైర్‌మెంట్ తర్వాత ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి అనువైన పొదుపును ఎంచుకుని పాటించడం ముఖ్యం. క్రమశిక్షణతో ముందుగానే మదుపు చేస్తే అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. క్రమంగా కాలం గడుస్తున్న కొద్దీ అధిక పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment