Rising Credit Cards And UPI Payments Indicate Recovery In Consumption: Experts And Market Players - Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డ్‌ వాడకం మామూలుగా లేదుగా, తెగ కొనేస్తున్నారు!

Published Mon, Sep 12 2022 9:52 AM | Last Updated on Mon, Sep 12 2022 3:21 PM

Rising credit cards and UPI payments indicate recovery in consumption experts - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పట్టి .. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. క్రెడిట్‌ కార్డు, యూపీఐ చెల్లింపుల ధోరణులే ఇందుకు నిదర్శనమని నిపుణులు, మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ నెలవారీ గణాంకాల ప్రకారం ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 9.83 లక్షల కోట్లుగా ఉండగా ఆగస్టులో రూ. 10.73 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) టెర్మినల్‌ ద్వారా క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు ఏప్రిల్‌లో రూ. 29,988 కోట్లుగా ఉండగా ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు చేరాయి.

ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలలో క్రెడిట్‌ కార్డుల వినియోగం రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరింది. 2017-2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో క్రెడిట్‌ కార్డులపై బకాయిలు వార్షిక ప్రాతిపదికన 16 శాతం మేర పెరిగినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ రామ్మోహన్‌ రావు అమర తెలిపారు. ‘క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం పెరిగే కొద్దీ వాటితో ఖర్చు చేయడం కూడా పెరిగింది. గత కొద్ది నెలలుగా సగటున నెలకు క్రెడిట్‌ కార్డులపై చేసే వ్యయాలు రూ. 1 లక్ష కోట్లు దాటుతోంది. భారీ వినియోగ ధోరణులను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్‌ రానుండటంతో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 

డిజిటల్‌ ఊతం.. 
డిజిటల్‌ లావాదేవీలు ఇటు విలువపరంగా అటు అమ్మకాలపరంగా పెరుగుతుండటం ఎకానమీకి మేలు చేకూర్చే అంశమని పేనియర్‌బై ఎండీ ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి వివిధ విధానాల విషయంలో భయాలను పక్కనపెట్టి ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, ఆదాయాలు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ మెరుగు పడుతుండటం వంటి అంశాలు ఆన్‌లైన్‌ చెల్లింపుల వృద్ధికి దోహదపడుతున్నాయని బజాజ్‌ చెప్పారు.

మరింతమంది వర్తకులు డిజిటల్‌ పేమెంట్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం మరో సానుకూలాంశమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారు కూడా యూపీఐని ధీమాగా వినియోగిస్తుండటంతో ప్రస్తుత పండుగ సీజన్‌లో ఈ విధానంలో చెల్లింపులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సర్వత్రా టెక్నాలజీస్‌ ఎండీ మందర్‌ అగాషే చెప్పారు.

మరోవైపు, డెబిట్‌ కార్డులు కాకుండా క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగు తుండటానికి రెండు పార్శా్వలు ఉండవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ (ఎకనమిక్‌ అడ్వైజరీ సర్వీసెస్‌) రణేన్‌ బెనర్జీ తెలిపారు. కుటుంబాలు నిజంగానే మరింతగా ఖర్చు చేస్తూ ఉండటం ఒక కోణం కాగా, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రుణాలపై ఆధారపడుతుండటం మరో కోణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement