వడ్డీ రేట్లు పెరగడం రిస్కు కాదు.. | Sakshi Interview on DSP Investment Managers Fund Head Saurabh Bhatia | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు పెరగడం రిస్కు కాదు..

Published Sat, Apr 10 2021 5:13 AM | Last Updated on Sat, Apr 10 2021 5:29 AM

Sakshi Interview on DSP Investment Managers Fund Head Saurabh Bhatia

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిక్స్‌డ్‌ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు వడ్డీ రేట్లు పెరిగే రిస్కుల గురించి ఆందోళన చెందకుండా, పరిస్థితికి తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకుంటే సరిపోతుందని డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫండ్‌ మేనేజర్‌ సౌరభ్‌ భాటియా సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ పరిణామాలతో పుష్కలంగా నిధులు వచ్చినప్పటికీ.. పరిస్థితులు చక్కబడి లిక్విడిటీ తగ్గిపోతే వర్ధమాన దేశాలకు నిధుల సమీకరణ వ్యయాలు పెరగవచ్చని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు..

► ప్రస్తుతం కనిష్ట స్థాయుల్లో ఉన్న వడ్డీ రేట్లు ఇక్కణ్నుంచి పెరిగే రిస్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఫండ్‌ మేనేజర్లు ఎలాంటి వ్యూహాలు పాటించే అవకాశం ఉంది?  
వడ్డీ రేట్లు పెరగడమనేది రిస్కుగా భావించడం లేదు. వడ్డీ రేట్లు తగ్గడం, పెరగడానికి సంబంధించిన వలయంలో ఇది కూడా ఒక భాగం. ఇక నుంచి పెరిగే అవకాశాలు ఉన్నందున ఇన్వెస్టర్లు తమ వ్యూహాలను అందుకు అనుగుణంగా మార్చుకుంటే సరిపోతుంది. రేట్లు తగ్గేటప్పుడు క్యాపిటల్‌ గెయిన్స్‌ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఫండ్‌ సంస్థలు అధిక మెచ్యూరిటీ వ్యవధి ఉన్న బాండ్లను, పెరిగే క్రమంలో మూలధన నష్టాలను తగ్గించుకునేందుకు తక్కువ మెచ్యూరిటీ వ్యవధి ఉండే బాండ్లను ఎంచుకుంటూ ఉంటాయి. మనీ మార్కెట్‌ సాధనాల్లో ఎక్కువ మొత్తాన్ని ఉంచడం తదితర మార్గాలు అనుసరిస్తుంటాయి. వీటితో పాటు ఇతరత్రా రిస్కులను తగ్గించుకునే సాధనాలను ఉపయోగించుకోవడం వల్ల రాబడులను కాపాడుకునే వీలుంటుంది.  

► ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం తగ్గే కొద్దీ రుణ సమీకరణ వ్యయాలు, ఎన్‌పీఏలు పెరిగే అవకాశముంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?  
సాధారణంగా కరోనా వైరస్‌ వంటి మహమ్మారులు దాడి చేసినప్పుడు ఎకానమీలోని వివిధ రంగాలపై వివిధ స్థాయిల్లో ప్రతికూల ప్రభావాలు పడుతూ ఉంటుంది. ఇవి కోలుకోవడమనేది నెమ్మదిగానే జరుగుతుంది. కరోనా వైరస్‌ దెబ్బకు ఎకానమీ పూర్తిగా కుదేలు కాకుండా చూడటంతో పాటు సజావుగా వృద్ధి బాట పట్టేందుకు కూడా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు సరైన నిర్ణయాలే తీసుకున్నాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించే క్రమంలో భారీ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తగినంత స్థాయిలో నిధుల లభ్యత ఉండేలా చూడటంపై దృష్టి పెడుతున్నాయి.   

► ఫిక్స్‌డ్‌ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్వెస్టర్లు ఎంచుకోవాల్సిన వ్యూహాలేమిటి?
వడ్డీ రేట్ల తీరు మారే కొద్దీ పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు ఫండ్‌ మేనేజర్లు అమలు చేసే వ్యూహాలతో మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం, ఆశించిన స్థాయిలో పనితీరు కనపడకపోవడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ప్రస్తుత ఇన్వెస్టర్లు .. కొత్త పరిణామాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న పక్షంలో తమ పెట్టుబడుల విషయంలో తగు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. లేదా ఫండ్‌ మేనేజర్‌కే వదిలేయడం శ్రేయస్కరం. కొత్త ఇన్వెస్టర్లయితే తాము ఎంచుకునే ఫండ్‌కి రిస్కు పరిధులు ఏమిటి, వాటిని ఎదుర్కొనడంలో ఫండ్‌ ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తోంది, పెట్టుబడుల్లో ఆటుపోట్లను ఎలా తట్టుకోగలుగుతోంది వంటి అంశాలను పరిశీలించాలి. రిస్కు పరిధులను ఫండ్‌ అతిక్రమించనంతవరకూ అంచనాలకు దరిదాపుల్లోనే రాబడులు ఉండగలవు.

► దేశీ ఫిక్స్‌డ్‌ ఇన్‌కం మార్కెట్లపై ప్రభావం చూపే అంతర్జాతీయ అంశాలేమిటి?
వృద్ధి పుంజుకుంటుందన్న ఆశలను సజీవంగా ఉంచడానికి లిక్విడిటీ (నిధుల లభ్యత) అనేది చాలా ముఖ్యమైనది. ప్రపంచ దేశాల బ్యాంకులు నిధులను పుష్కలంగా అందుబాటులో ఉంచాయి. దేశీయంగాను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఈ కష్టకాలంలో ఎకానమీని గట్టెక్కించడంలో తగిన చర్యలు తీసుకున్నాయి. దీనితో మన దేశానికి భారీగా నిధులు తరలివచ్చాయి. ఇక వృద్ధి          నిలకడగా పుంజుకుని, అమెరికాతో పాటు ఇతర దేశాల సెంట్రల్‌ బ్యాంకుల చర్యల కారణంగా నిధుల లభ్యత తగ్గడం మొదలవుతుందో సంపన్న దేశాల మార్కెట్లలో బాండ్‌ ఈల్డ్‌లు పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో వర్ధమాన దేశాల నుంచి నిధులు క్రమంగా సంపన్న మార్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉంది. ఫలితంగా భారత్‌ వంటి వర్ధమాన దేశాల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement