టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్‌లు, క్యాబిన్ సిబ్బందికి ఏప్రిల్ 1 నుంచి జీతాలను సవరించింది. ఏ స్థాయి ఉద్యోగం ఎంత జీతం వస్తోందో తాజాగా వెల్లడైంది.
సవరించిన జీతాల ప్రకారం.. ఎయిర్ ఇండియా పైలట్‌కు నెలకు కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.8.5 లక్షలు జీతం లభిస్తోంది. ఇక క్యాబిన్ సిబ్బందికి కనీసం రూ.25,000 నుంచి సీనియారిటీ, ఇతర అంశాల ఆధారంగా గరిష్టంగా రూ.78,000 జీతం వస్తున్నట్లు తెలుస్తోంది.
పైలట్లు, ఇతర సిబ్బంది జీతాలు ఇలా..
కనిష్టంగా ట్రైనీ పైలట్‌కు నెలకు రూ.50,000 లభిస్తుంది. లైన్ రిలీజ్ తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ఒక సంవత్సరం వరకూ నెలకు రూ.2.35 లక్షలు వస్తుంది. ఇక ఫస్ట్ ఆఫీసర్లు రూ. 3.45 లక్షలు, కెప్టెన్ రూ 4.75 లక్షలు జీతం అందుకుంటారు. కెప్టెన్ నుంచి అప్‌గ్రేడ్ అయిన కమాండర్‌కు రూ. 7.50 లక్షలు వస్తుంది. 4 సంవత్సరాల కంటే ఎక్కువ P1 రేటింగ్ ఉన్న సీనియర్ కమాండర్ నెలకు రూ.8.50 లక్షలు పొందుతారు.
జీతంతో పాటు జూనియర్ పైలట్‌కు గంటకు రూ. 1,500 నుంచి రూ. 1,950 ఫ్లయింగ్ హవర్స్ అలవెన్సులు చెల్లిస్తారు. కమాండర్లు, సీనియర్ కమాండర్‌లకు నెలకు రూ.75,000, ఇతర వర్గాల పైలట్‌లకు రూ.25,000 బాడీ అలవెన్స్ ఉంటుంది. ఇదికాక కమాండర్లు, సీనియర్ కమాండర్లకు ఒక రాత్రికి రూ.2,200 చొప్పున డొమెస్టిక్ లేఓవర్ అలవెన్స్ లభిస్తుంది.
ఇక ట్రైనీ క్యాబిన్ సిబ్బందికి ఫ్రెషర్‌కు రూ.25,000, అనుభవజ్ఞులైనవారికి రూ.30,000 స్టైఫండ్ లభిస్తుంది. రెగులర్ క్యాబిన్ సిబ్బందికి రూ.53,000, సీనియర్లకు రూ.64,000, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది నెలకు రూ.78,000 అందుకుంటారు. ఫ్లయింగ్ అలవెన్స్ క్యాబిన్ సిబ్బందికి రూ.375 నుంచి రూ.750 వరకు చెల్లిస్తారు. ఇక సీనియర్ క్యాబిన్ సిబ్బందికి రూ.475 నుంచి రూ.950 వరకు, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది రూ.525 నుంచి రూ.1,050 వరకు ఫ్లయింగ్ అలవెన్స్ అందుకుంటారు.
కాగా శాశ్వత క్యాబిన్ సిబ్బందికి సాధారణ భత్యం 0-60 గంటల విమాన ప్రయాణానికి రూ.300, 65-70 గంటలకు రూ.375గా నిర్ణయించారు. సీనియర్ ఉద్యోగులు 0-65 గంటలు ప్రయాణం చేస్తే రూ.400 నుంచి రూ.650, అలాగే 65-70 గంటల వరకు రూ.525 నుంచి రూ.700 వరకు పొందుతారు.
ఇదీ చదవండి: వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment