న్యూఢిల్లీ: దేశీయంగా ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో 78,627 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9 శాతం ఎగిశాయి. ఒక త్రైమాసికంలో ఇంత అత్యధికంగా విక్రయాలు నమోదు కావడం గత నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీంతో వరుసగా మూడో క్వార్టర్లో కూడా కరోనా పూర్వపు త్రైమాసిక సగటు అమ్మకాల పరిమాణాన్ని గణనీయంగా అధిగమించినట్లయిందని నివేదిక వివరించింది.
దేశవ్యాప్తంగా డిమాండ్ నిలకడగా రికవర్ అవుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. ఎకానమీ పటిష్టమవుతుండటం, అలాగే వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక సామర్థ్యాలపై భరోసా పెరుగుతుండటం తదితర అంశాలతో గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయంగా కీలక మార్కెట్లలో నివాస గృహాల విక్రయాలు పుంజుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ‘తక్కువ వడ్డీ రేట్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత, వేతనాల వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డెవలపర్లపై ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోళ్ల లావాదేవీలు పుంజుకునే కొద్దీ క్రమంగా ధరలు పెరగవచ్చని, తద్వారా సిమెంటు.. స్టీల్ వంటి ముడి ఉత్పత్తుల ధరల భారాన్ని అధిగమించేందుకు వారికి కొంత వెసులుబాటు లభించవచ్చని బైజల్ వివరించారు.
మరో రెండు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు అనరాక్, ప్రాప్‌టైగర్ కూడా ఇటీవలే రెసిడెన్షియల్ మార్కెట్లకు సంబంధించిన డేటా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనరాక్ నివేదిక ప్రకారం ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తొలి త్రైమాసికంలో 71 శాతం పెరిగి 99,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రాప్‌టైగర్ డేటా ప్రకారం ఎనిమిది ప్రధాన నగరాల్లో హౌసింగ్ విక్రయాలు 7 శాతం పెరిగి 70,623 యూనిట్లకు చేరాయి.
నైట్ ఫ్రాంక్ నివేదికలో మరిన్ని అంశాలు..
- ఢిల్లీ–ఎన్‌సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో అమ్మకాలు రెట్టింపై 15,019 యూనిట్లుగా నమోదయ్యాయి.
- బెంగళూరులో 34 శాతం వృద్ధి చెంది 13,663 గృహాలు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో విక్రయాలు 35 శాతం పెరిగి 4,105 యూనిట్లుగా నమోదయ్యాయి.
- హైదరాబాద్‌లో మాత్రం అమ్మకాలు ఒక్క శాతమే పెరిగి 6,993 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్‌కతాలో కూడా స్వల్పంగా ఒక్క శాతం వృద్ధితో 3,619 గృహాలు అమ్ముడయ్యాయి.
- ముంబైలో 9 శాతం క్షీణించి 21,548 ఇళ్లు అమ్ముడయ్యాయి. అటు పుణెలోనూ రికార్డు స్థాయిలో 25 శాతం క్షీణించి 10,305 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. ఇక చెన్నైలో 17 శాతం తగ్గి 3,376 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- వివిధ మార్కెట్లలో హౌసింగ్ ధరలు 1–7 శాతం శ్రేణిలో పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment