ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా.. | Satya Nadella Joined Microsoft In 1992 And Has Held Various Roles, Check About His Complete Journey | Sakshi
Sakshi News home page

Satya Nadella BDay: ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా..

Published Mon, Aug 19 2024 3:03 PM | Last Updated on Mon, Aug 19 2024 5:31 PM

satya Nadella joined Microsoft in 1992 and has held various roles

ప్రపంచ ఐటీ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ షేర్‌ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల(57)నేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి’ అనే నియామాన్ని సత్య ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో ఆగస్టు 19, 1967లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో  ఎంఎస్‌ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.

సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద దాదాపు రూ.251 లక్షల కోట్లు (3 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు(రూ.8.3 లక్షలు) పెట్టి మైక్రోసాఫ్ట్‌ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు(రూ.95 లక్షలు) అయ్యేది.

బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే సత్యకు పెద్ద సవాలే. ఆయన సీఈఓ అవ్వడానికంటే 22 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. దాంతో చాలామంది సత్య సుధీర్ఘ ప్రస్థానంలో సాధించలేనిది సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నాదెళ్ల చేసే ప్రతి పనిని గత సీఈఓల పనితీరుతో పోల్చేవారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.

‘అజూర్‌’ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్‌ ఏఐ ద్వారా అజూర్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకురాగలిగారు. దాంతో గూగుల్‌, అమెజాన్‌లతో పోల్చితే మైక్రోసాఫ్ట్‌ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా వచ్చే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్‌ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్‌ బామర్‌ 7.3 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!

పేరు: సత్య నారాయణ నాదెళ్ల
తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్
తల్లి: ప్రభావతి
భార్య: అనుపమ నాదెళ్ల
పిల్లలు: 3
కుమారుడు: జైన్ నాదెళ్ల
కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల
జన్మస్థలం: హైదరాబాద్
వయసు:  57 (2024)
జాతీయత: భారతీయుడు
పౌరసత్వం: యూఎస్‌ఏ
చదువు: మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ
వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్
డెజిగ్నేషన్‌: మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్, సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement