ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లను దాటింది. రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం గడచిన పదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగిందని బ్యాంక్ బుధవారం తెలిపింది. 2011లో ఈ విభాగానికి సంబంధించి ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించిందని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్‌లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్‌బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. 2012లో రూ. లక్ష కోట్ల పోర్ట్‌ఫోలియోతో ఒక ప్రత్యేక ఆర్‌ఈహెచ్‌బీయూ విభాగం ప్రారంభమైంది.
అచంచల విశ్వాసానికి నిదర్శనం
బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసం అచంచలంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు వినియోగిస్తున్న సాంకేతికత, అలాగే వ్యక్తిగత సేవలు కారణమని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యాధునిక సమ్మిళిత వేదిక– రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటని తెలిపారు. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇదని పేర్కొన్నారు.
రూ.5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ గృహ రుణ వ్యాపారం
Published Thu, Feb 11 2021 4:30 AM | Last Updated on Thu, Feb 11 2021 5:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment