
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్‌పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్‌స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.
ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్‌సీజెడ్‌పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్‌సీజెడ్‌పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.
జెడ్‌సీజెడ్‌పీలంటే?
సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్‌ఎస్‌ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్‌సీజెడ్‌పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.
ఎస్‌ఎస్‌ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్‌ఎస్‌ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment