
ప్రపంచ మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా బుధవారం లాభాల్లోనే ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకొని 74.82కు చేరడం..... సానుకూల ప్రభావం చూపించాయి. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 38,615 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,408 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి.
ప్రభుత్వం చేయూత...!
ప్రభుత్వం చేయూతతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోగలవన్న అంచనాలతో కొనుగోళ్లు జరుగుతున్నాయని నిపుణులంటున్నారు. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా,యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
► నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను రూ.620 కోట్లకు కొనుగోలు చేయడంతో రిలయన్స్ షేర్ 0.7% లాభంతో రూ.2,133 వద్ద ముగిసింది.
► టెక్ మహీంద్రా షేర్ 2 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద ఆర్‌బీఐకి రూ.35,000 కోట్లు చెల్లించడంతో యస్ బ్యాంక్ 5% ఎగబాకి రూ.15.80 వద్ద ముగిసింది.
► రిలయన్స్ ఇండస్ట్రీస్....వాటాను కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా ఫ్యూచర్ రిటైల్ 19% లాభంతో రూ.119 వద్ద ముగిసింది.
► దాదాపు 180కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అంబుజా సిమెంట్స్, టాటా కాఫీ, ఎస్‌బీఐ కార్డ్స్ వంటివి ఉన్నాయి.
యాపిల్ @ రూ.150 లక్షల కోట్లు!
న్యూయార్క్: యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ బుధవారం 2 లక్షల కోట్ల డాలర్లకు (రూ.150 లక్షల కోట్లు) చేరింది. ఈ ఘనత సాధించిన తొలి అమెరికా కంపెనీ ఇదే. ప్రపంచంలో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీ ఇది. గత ఏడాది డిసెంబర్‌లో సౌదీ ఆరామ్‌కో ఈ రికార్డ్ సాధించింది. అయితే చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 1.82 లక్షల కోట్ల డాలర్లుగానే ఉంది.
లాక్‌డౌన్ కారణంగా చైనాలో ఐఫోన్ తయారీ తగ్గింది. అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా ఉండటంతో యాపిల్‌కు క్రేజ్ తగ్గలేదని నిపుణులంటున్నారు. కాగా, యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌కు సమానం. రూ.13.8 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దగ్గర అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా నిలిచింది.
రెండేళ్లలో రెట్టింపు....: ఒక్కో షేర్‌ను నాలుగు షేర్లుగా విభజించనున్నామని మూడు వారాల క్రితం యాపిల్ కంపెనీ తెలిపింది. అప్పటినుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 60 శాతం లాభపడింది. ఈ కంపెనీ విలువ రెండేళ్లలోనే రెట్టింపు కావడం విశేషం. రాత్రి 11.30కి న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో యాపిల్ షేర్ 1 శాతం లాభంతో 467 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.