
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు జంప్‌చేసి 38,956ను తాకగా.. నిఫ్టీ 55 పాయింట్లు పురోగమించి 11,495 వద్ద ట్రేడవుతోంది. టెక్నాలజీ, ఫార్మా దిగ్గజాల అండతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.
బ్లూచిప్స్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌సహా అన్ని రంగాలూ బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, గ్రాసిమ్, యూపీఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, ఎస్‌బీఐ 1.4-0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్, ఐషర్, శ్రీ సిమెంట్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
సీమెన్స్ ప్లస్
డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్, ఐడియా, అపోలో హాస్పిటల్స్, అమరరాజా, లుపిన్, మదర్‌సన్, మైండ్‌ట్రీ, డీఎల్‌ఎఫ్, నౌకరీ, ఐజీఎల్ కేడిలా, ఎస్‌బీఐ లైఫ్ 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. పీవీఆర్, ఐబీ హౌసింగ్, బీఈఎల్, బంధన్ బ్యాంక్, మణప్పురం, జిందాల్ స్టీల్, ఏసీసీ, సెయిల్, ఎంజీఎల్ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1069 లాభపడగా. 422 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.