
రోజంతా స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సోమవారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 73.35 వద్దకు చేరడం, ఆర్థిక రికవరీపై సంశయాలు, కరోనా కేసుల విషయంలో బ్రెజిల్‌ను దాటేసి భారత్ రెండో స్థానంలోకి రావడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, శనివారం అమెరికా స్టాక్ సూచీలు నష్టపోవడం.., ప్రతికూల ప్రభావం చూపించాయి. రోజంతా 459 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 60 పాయింట్ల లాభంతో 38,417 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,355 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
అమెరికా మార్కెట్‌కు సెలవు.
► హిందుస్తాన్ యూనిలివర్ 2 శాతం లాభంతో రూ.2,162 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. డిక్సన్ టెక్నాలజీస్, వాబ్‌కో ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► ఆస్ట్రాజెనెకా ఫార్మా షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.4,670ను తాకిన ఈ షేర్ చివరకు 18 శాతం లాభంతో రూ.4,586 వద్ద ముగిసింది. కరోనా వ్యాక్సిన్ రేసులో ఈ కంపెనీ వ్యాక్సినే ముందంజలో ఉందన్న వార్తలతో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది.
► టాటా మోటార్స్ డీవీఆర్(డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్) షేర్ 10% లాభంతో రూ.62 వద్ద ముగిసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.30 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ టాటా సన్స్ కొనుగోలు చేసిందన్న వార్తలే దీనికి కారణం.
► వరుసగా ఐదో రోజూ ఫ్యూచర్ రిటైల్ షేర్ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ క్యూ1లో ఈ కంపెనీకి రూ.478 కోట్ల నికర నష్టాలు రావడమే దీనికి కారణం.
► రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ, కొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్ 2 శాతం లాభంతో రూ.12.30 వద్ద ముగిసింది.
► దాదాపు 300 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హోమ్ ఫైనాన్స్, డిష్ టీవీ, తాన్లా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.