
వరుసగా ఆరో రోజు నేడు (31న) దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 71 పాయింట్లు ఎగసి 11,753 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ తొలి రోజు 11,682 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వారాంతాన యూఎస్ మార్కెట్లు మరోసారి రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. వరుసగా ఆరో రోజు ఎస్‌అండ్‌పీ కొత్త గరిష్టానికి చేరగా నాస్‌డాక్ 40వ సారి రికార్డ్ హై వద్ద నిలిచింది. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. అయితే ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు దిగే అవకాశమున్నదని నిపుణులు భావిస్తున్నారు.
బ్యాంకింగ్ పుష్
ప్రధానంగా బ్యాంకింగ్ కౌంటర్లు జోరు చూపడంతో వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు ఎగసి 39,467 వద్ద నిలవగా.. నిఫ్టీ 88 పాయింట్లు బలపడి 11,648 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,686- 11,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,596 పాయింట్ల వద్ద, తదుపరి 11,544 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,694 పాయింట్ల వద్ద, ఆపై 11,738 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,878 పాయింట్ల వద్ద, తదుపరి 23,233 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,891 పాయింట్ల వద్ద, తదుపరి 25,258 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.