న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్‌వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్‌లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ)
ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్‌పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్‌ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్‌క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్‌లకు ఎస్‌వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా)
ఎస్‌వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్‌తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్‌టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్‌లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్‌వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు.
సత్వర టేకోవర్‌కు ఆస్కారం..
ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్‌వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్‌మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు.
స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్‌లపై ఎస్‌వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు.
భారతీయ స్టార్టప్‌లకు ఎస్‌వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్‌వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర‍్కజ్క్) ఎస్‌వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్‌వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది.
అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి..
దేశీ సంస్థలపై ఎస్‌వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment