‘‘భారత్ రూపాయి క్షీణించలేదు.కానీ వాస్తవానికి, అమెరికా డాలర్ బలపడింది’’ అంటూ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘ఈ ప్రకటనలో తప్పేముంది’ అని కొందరు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడితే, ‘ఈ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ కొందరు తమకు నచ్చిన విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ప్రతిపక్ష నాయకుల విమర్శలు సరేసరి. అయితే రూపాయి పతనంపై తక్షణం తీవ్ర ఆందోళన అక్కర్లేదన్న ధోరణితో సైతం ఆర్థికశాఖ వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలూ సీతారామన్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయా అంశాలపై ఒక్కసారి దృష్టి సారిస్తే..
20 ఏళ్ల గరిష్ట స్థాయిలో డాలర్ ఇండెక్స్
అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఆ రోజు 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడే, ముగింపు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. నిజానికి డాలర్‌తో పాటు ఫారెక్స్ మార్కెట్‌లో వివిధ కరెన్సీలతో రూపాయి ట్రేడింగ్ జరుగుతుంది.
అయితే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో (రెండు ప్రపంచ యుద్ధాల విధ్వంసం, బ్రిటన్ తన బంగారం నిల్వల నుంచి భారీ వ్యయాల నేపథ్యంలో 1944 బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి రిజర్వ్ కరెన్సీగా హోదాను స్టెర్లింగ్ నుంచి అమెరికా డాలర్ పొందింది) డాలర్‌కు ఉన్న ప్రాభల్యం దృష్ట్యా ప్రధానంగా అగ్రరాజ్య కరెన్సీతో రూపాయి మారకపు ట్రేడింగ్ విలువపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరి న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఆరు కరెన్సీల విలువలతో కూడా డాలర్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. డాలర్ విలువను ఈ ఇండెక్స్ ప్రధానంగా నిర్దేశిస్తుంది. యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనాలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రాతిపదికన డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన (మన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసిన రోజు) 20 సంవత్సరాల గరిష స్థాయిలో 113పైకి ఎగసింది. రెండు పాయింట్లు తగ్గినా ఇప్పుడూ దాదాపు అదే స్థాయిలో పటిష్టంగా ఉంది.
డాలర్ ఇండెక్స్ పెరిగిందెంతో.. రూపాయి అంతే పడింది...
దేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన 2014 మే నెలలో రూపాయి విలువ దాదాపు 58 వద్ద ఉంది. ఈ లెక్కన 2022 అక్టోబర్ 10వ తేదీనాటికి చూస్తే, రూపాయి విలువ దాదాపు 42 శాతం పతనమైంది. ఇక అంతర్జాతీయంగా ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఇది 79 నుంచి ఏకంగా 113 స్థాయికి చేరింది. అంటే డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు 43 శాతం ఎగసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డమే రూపాయి చరిత్రాత్మక పతనానికి కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, డాలర్ బలపడ్డమే ఆ కరెన్సీతో రూపాయి పతనానికి కారణమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చేస్తున్న వాదన బహుశా ఇందుకే కావచ్చు. కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశంపై క్రూడ్ బిల్లు భారం, ద్రవ్యోల్బణం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువకు చెక్ పెడుతున్నాయి.
చర్యలూ కొనసాగుతున్నాయ్...
డాలర్ మారకంలో రూపాయి తీవ్ర ఒడిదుడుకులను అడ్డుకోడానికి మరోవైపు ఆర్‌బీఐ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్న ఆర్‌బీఐ, ఇందుకు ఫారెక్స్ నిల్వలను దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా వినియోగించడం గమనార్హం. గత ఏడాది 642 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం దాదాపు 545 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం కట్టడితోపాటు ఫెడ్ ఫెండ్ రేటు పెంపు నేపథ్యంలో వెనుదిరుగుతున్న విదేశీ పెట్టుబడులను నిలువరించడానికీ రెపో రేటు పెంపు దోహదపడనుంది. మే నుంచి 4 దఫాల్లో రెపో రేటును ఆర్‌బీఐ 190 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.9 శాతానికి ఎగసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఈ నేపథ్యంలో రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యలో రూపాయిని వినియోగించే చర్యలకూ కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనిపై స్పందన బాగున్నట్లు కూడా ఆర్థికశాఖ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆయా చర్యల నేపథ్యంలో ప్రస్తుతానికి రూపాయి పతనంపై తీవ్ర ఆందోళన అనవసరమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదా?
2022లో రూపాయి 8 శాతం బలహీనపడితే, అందులో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన తర్వాత పతనమే అధికం. డాలర్ మారకంలో ప్రస్తుత రూపాయి విలువ పతనంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వర్గాలు భరోసాను ఇస్తున్నాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలను ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. యూరోసహా పలు ఇతర కరెన్సీలతో రూపాయి బలోపేతం కావడం ఇందులో ఒకటి. డాలర్ ఇండెక్స్‌లో పలు దేశాల కరెన్సీలు భారీ పతనాన్ని చూడ్డం రెండవది. ఈ రెండు అంశాలూ రూపాయి పతన నష్టాన్ని భర్తీ చేస్తాయన్నది నిపుణుల వాదన. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, కమోడిటీ ఎకానమీ అయిన ఇండోనేసియా, బ్రెజిల్ కరెన్సీలు మాత్రమే భారత్ కరెన్సీకన్నా కొంచెం బాగుండడం గమనార్హం.
డాలర్ ఎగువబాటకు కారణం..
ఇందుకు సంబంధించిన అంశాలను 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటి ఆర్థిక సంక్షోభం, ఈజీ మనీ అందుబాటులో భాగంగా జీరో స్థాయికి ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం నేపథ్యంలో 2008లో డాలర్ ఇండెక్స్70 స్థాయికి పడిపోయింది. అటు తర్వాత అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సన్నాహాల నేపథ్యంలో 2010 నాటికి 90 స్థాయికి ఇండెక్స్ ఎగసింది. అనుకున్నమేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేకపోవడంతో 2011 మేనాటికి తిరిగి డాలర్ ఇండెక్స్ తిరిగి 72 స్థాయిని చూసినా, అటు తర్వాత ముందుకే సాగింది.
ట్రంప్ పాలనా కాలంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం, కరోనా వంటి సమయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి, కఠిన ద్రవ్య విధానానికి ఫెడ్ మొగ్గుచూపడం వంటి అంశాలు డాలర్ ఇండెక్స్‌ను బలోపేతం చేస్తూ వచ్చాయి. దీనికితోడు ప్రపంచంలో తీవ్ర సంక్షోభ సమయాల్లో వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా, సురక్షిత పెట్టుబడిగా డాలర్‌లోకి పెట్టుబడులూ డాలర్ ఇండెక్స్ ఎల్లప్పుడూ లాభపడే అంశం. భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు, ఫెడ్ రేటు పెంపు ప్రస్తుతం డాలర్ బలానికి కలిసి వస్తున్న అంశాలు.
– సాక్షి బిజినెస్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment