న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) రూ. 5,196 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఆర్జించిన రూ. 5,583 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం క్షీణత. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం స్వల్ప వెనకడుగుతో రూ. 75,981 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 76,798 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన తాజా క్వార్టర్‌లో నికర లాభం 4 శాతం నీరసించి రూ. 6,258 కోట్లను తాకింది. గతంలో రూ. 4,500 కోట్లమేర లభించిన అదనపు ఆదాయం కారణంగా లాభాలు అధికమైనట్లు బ్యాంక్ ప్రస్తావించింది. వీటిలో ఎస్సార్ స్టీల్ రుణ పరిష్కారం ద్వారా రూ. 4,000 కోట్ల వడ్డీ లభించగా.. మరో రూ. 500 కోట్ల ఇతర ఆదాయం నమోదైనట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వివరించారు.
ప్రొవిజన్లు అప్
తాజా సమీక్షా కాలంలో ఎస్‌బీఐ ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడింది. క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.94 శాతం నుంచి 4.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 2.65 శాతం నుంచి 1.23 శాతానికి క్షీణించాయి. అయితే మొండి రుణాలకు ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 7,253 కోట్ల నుంచి రూ. 10,342 కోట్లకు పెరిగాయి. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 27,779 కోట్లకు చేరింది. ఇందుకు 7 శాతం రుణ వృద్ధి సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.12 శాతంగా నమోదయ్యాయి. రిటైల్ రుణాలు 15 శాతం జంప్‌చేయగా.. మొత్తం లోన్ బుక్‌లో వీటి వాటా 61 శాతానికి చేరాయి. వీటిలో వ్యక్తిగత రుణ వాటా 39 శాతంకాగా.. ఏడాది కాలంలో 45 శాతానికి పెరిగే వీలున్నట్లు ఖారా అంచనా వేశారు. డిసెంబర్‌కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతాన్ని తాకింది. ఇతర ఆదాయం రూ. 9106 కోట్ల నుంచి రూ. 9246 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మారటోరియంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీఎన్‌పీఏలుగా పరిగణించే స్లిప్పేజెస్ రూ. 16,461 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.6 శాతం జంప్‌చేసి రూ. 358 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 331 వద్ద కనిష్టానికీ చేరింది. షేరు ధర పుంజుకోవడంతో ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 17,000 కోట్లకుపైగా బలపడింది. వెరసి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3.19 లక్షల కోట్లను అధిగమించింది.
ఎస్‌బీఐ మొండిబాకీలు తగ్గాయ్
Published Fri, Feb 5 2021 6:09 AM | Last Updated on Fri, Feb 5 2021 6:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment