
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. దాంతో వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది. సెన్సెక్స్ 377.50 పాయింట్లు లేదా 0.54% క్షీణించి 69,551.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 90.70 పాయింట్లు లేదా 0.43% నష్టంతో 20,906.40 వద్దకు చేరింది.
మార్కెట్ ఇటీవల భారీగా ర్యాలీ అయింది. దాంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. నవంబర్ నెలలో నమోదైన ద్రవ్యోల్బణం కారణంగా నిఫ్టీ కొంత నష్టాల బాటపట్టినట్లు తెలుస్తోంది. రేపు రానున్న ఫెట్ మినట్స్ మీటింగ్ వివరాలు ఎలా ఉండబోతాయోననే ఆందోళనతో ఇన్ని రోజులు లాభాల్లో ఉన్న స్టాక్‌లను రిటైల్ ఇన్వెస్టర్లు విక్రయించినట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీరేట్లలో పెంపు ఉండకపోవచ్చుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రేట్ల కోతపై ఫెడ్ నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి సూచీలు రాణించాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, విప్రో, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో ముగిశాయి. సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం స్టాక్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,261 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,032 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.